పహల్గామ్ ఉగ్రదాడికి తీవ్ర ప్రతీకారంగా భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట నిర్వహించిన ఆకస్మిక చర్య పాక్ ఉగ్రవాద ముఠాలు హతమయ్యాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)తో పాటు పాక్‌లోని బహావల్పూర్, ముజఫరాబాద్ పరిసరాల్లో ఉన్న ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న భారత సైన్యం, గంటల పాటు ఎయిర్ స్ట్రైక్‌లు కొనసాగించి పలు శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యినట్లు నిఘా వర్గాల సమాచారం.
ఈ చర్యతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఆర్మీ, పాలక వర్గాలు షాక్ అయ్యాయి. ప్రధాని షహబాజ్ షరీఫ్ అత్యవసర భద్రతా సమీక్ష సమావేశాలు నిర్వహించగా, పాక్ సైనికాధికారులకు భారత్‌కి తక్షణ స్పందన ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు, భారతీయ రాయబారిని పాక్ విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి అధికారికంగా నిరసన తెలిపింది. భారత దాడులు అంతర్జాతీయ నియమాల ఉల్లంఘనగా పేర్కొంటూ, దీనికి తగిన ప్రతిస్పందన ఇస్తామని ఆ దేశ సమాచార మంత్రి అతుల్లా తరార్ హెచ్చరించారు.
ఈ పరిణామాలతో పాకిస్తాన్ పలు ముఖ్య నగరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. దేశ భద్రతా యంత్రాంగం హై అలర్ట్‌లో ఉండగా, భారత భూభాగాలపై ఎదురుదాడికి సంబంధించి పాక్ సైన్యం వ్యూహరచన చేపట్టినట్లు గోప్యంగా లభించిన సమాచారం. ఇక మరోవైపు, పాక్ ప్రధాని షరీఫ్ త్వరలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారత దాడులపై ప్రభుత్వ వైఖరిని, భద్రతా రంగం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నట్లు ఆయన కార్యాలయం పేర్కొంది. ఈ పరిణామాలతో భారత్-పాక్ మధ్య తిరిగి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.