Friday, September 20, 2024
HomeదైవంSrisailam: కన్నులపండువగా మల్లన్న రథోత్సవం

Srisailam: కన్నులపండువగా మల్లన్న రథోత్సవం

భూమండలానికి నాభి స్థానంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. అశేష భక్త వాహిని మధ్య భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది తెలుగు, కన్నడ, మరాఠా భక్తులు శ్రీగిరికి పోటెత్తారు. హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివనామ స్మరణతో శ్రీశైల పురవీధులు మారుమ్రోగాయి. ఓంకార నాదంతో ఓం నమఃశివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో భక్తులు పులకించి పోయారు. ముందుగా శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో వైభవంగా గంగాధర మండపం వద్ద ఉన్న రథశాల వద్దకు తరలి రాగా ఉత్సవ మూర్తులకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లు రథోత్సవానికి సిద్ధమయ్యారు. అశేష జన వాహిని మధ్య రథోత్సవం కదలగానే వేలాది మంది భక్తులు ఓం నమః శివాయ నినదించటంతో శ్రీశైల క్షేత్రం పులకరించి పోయింది. ఈ రథోత్సవం కార్యక్రమంలో ఆలయ ఈవో లవన్న దంపతులు, శ్రీశైల జగద్గురు పీఠాధిపతి 1008 చెన్నసిద్దరామ శివచార్య స్వామి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News