భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. ఈ పరిస్థితులు యుద్ధస్థితి దిశగా వెళ్తున్నాయని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం అత్యంత కీలక భద్రతా సమీక్షా సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో త్రివిధ దళాధిపతులతో కలిసి ఈ భేటీ నిర్వహించబడింది. దేశ భద్రతకు సంబంధించి తాజా పరిణామాలపై సమగ్రంగా చర్చించేందుకు ఈ అత్యున్నత స్థాయి భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్స్‌తో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. పాకిస్తాన్ జరుపుతున్న రెచ్చగొట్టే చర్యలు, సరిహద్దులో డ్రోన్ దాడులు, కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న ఘటనలు ముఖ్యంగా చర్చకు వచ్చాయి.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం… దేశంపై జరిగే ఏవైనా ఉగ్రదాడులను ఇకపై ‘యుద్ధ చర్య’గా పరిగణించనుంది కేంద్రం. ఇది సాధారణంగా ఉగ్రవాద చర్యలపై భారత ప్రభుత్వ స్థైర్యతను, మారుతున్న వ్యూహాన్ని సూచించే కీలక ముందడుగు. “ఉగ్రవాదాన్ని ఇక ప్రశాంతంగా చూస్తే, అది భవిష్యత్తులో మన శక్తిని ప్రశ్నించే పరిస్థితి సృష్టించగలదు” అని భావించిన కేంద్రం.. పాక్ ప్రేరిత ఉగ్రవాదాన్ని ఇకపై పూర్తిగా నిర్మూలించాలని కంకనం కట్టుకుంది.
అంతేకాక, భవిష్యత్తులో పాక్ ప్రేరిత దాడులకు ఎదురుదాడి చేసే ప్రణాళికలపై కూడా చర్చ జరిగింది. వ్యూహాత్మక స్థాయిలో టార్గెట్ల ఎంపిక, సమాచార నిఘా వ్యవస్థ బలోపేతం, డ్రోన్ యుద్ధానికి ప్రతిస్పందన వ్యవస్థల్లో మెరుగుదల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే.. భారత్ ఇక రక్షణకే పరిమితం కాకుండా, దాడికి తగినదిగా ప్రతిస్పందించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టమవుతోంది. పాక్ ప్రేరిత ఉగ్రవాదానికి ఇక చోటు లేదని, అవసరమైతే సరిహద్దుల ఆవల చొచ్చుకెళ్లి ఎదురుతీరుతామని భారత్ తరపున స్పష్టమైన హెచ్చరిక జారీ చేయడం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ భేటీ ఫలితాలు త్వరలోనే మరిన్ని వ్యూహాత్మక చర్యల రూపంలో బయటపడే అవకాశముంది. ప్రస్తుతం భారత్ దాడులు మరింత పెంచే విధంగా ఉందని ఈ సమావేశం సంకేతాలిస్తోంది. ఇది భారత్ భద్రతా వ్యూహంలో వంతెనగా నిలిచే కీలక మలుపు కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.