భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవోలు) మధ్య హాట్ లైన్ చర్చలు కాసేపట్లో జరగనున్నాయి. పాక్ వైపు నుంచి కాల్పుల విరమణ ఒప్పందం పలుమార్లు ఉల్లంఘించబడిన నేపథ్యంలో, ఈ చర్చల్లో భారత్ ఘాటుగా స్పందించనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదానికి మద్దతివ్వడం ఆపేయాలని, ఇప్పటికే భారత్ వశంగా ఉన్న పక్కా ఆధారాల ఆధారంగా పాక్‌ను నిలదీసేందుకు భారత్ సిద్ధమవుతోంది.
ఈ చర్చల్లో భారత్ పలు కీలక డిమాండ్లు పెట్టనుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌కు అప్పగించాలని, ఆ ప్రాంతంలో దాక్కొని ఉన్న కీలక ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని డిమాండ్ చేయనుంది. అదేవిధంగా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరొకసారి ఉల్లంఘించకూడదని, సరిహద్దుల్లో ఉద్దీపన చర్యలకు తావు ఇవ్వకుండా ఉండాలని స్పష్టంగా హెచ్చరించనుంది. అంతేకాకుండా, తమ భూభాగం నుంచి కార్యకలాపాలు నడుపుతున్న ఉగ్రవాద సంస్థలపై పాక్ ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని భారతదేశం స్పష్టం చేయనుంది.
ఇటీవల జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారీ స్థాయిలో సైనిక చర్యలకు దిగింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పీవోకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయగా, దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు.
భారత్ దాడులకు ప్రతీకారంగా పాక్ వైపు నుంచి డ్రోన్లతో, మిస్సైల్‌లతో భారత సైనిక స్థావరాలు, జనావాసాలపై దాడులు జరిగాయి. అయితే, భారత సైన్యం ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం ఉండగా, మరోవైపు డ్రోన్ల దాడులతో పాక్ దుందుడుకు వైఖరిని ప్రదర్శించడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న హాట్ లైన్ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ చర్చల ఫలితంపై దేశం మొత్తం మళ్లీ ఉత్కంఠతో ఎదురు చూస్తోంది.