ఐపీఎల్(IPL) ఫ్రాంఛైజీలకు దక్షిణాఫ్రికా(South Africa) క్రికెట్ బోర్డు ఊరట కల్పించింది. ఐపీఎల్ రీషెడ్యూల్ నేపథ్యంలో తమ ఆటగాళ్లు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐపీఎల్‌కు మే 26 వరకు మాత్రమే అందుబాటులో ఉంటారని ప్రకటించింది. జూన్‌లో ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో తమ ఆటగాళ్లను స్వదేశానికి రావాలని ఆదేశించింది. అయితే తాజాగా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈనేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా ప్రకటించిన 15 మంది ఆటగాళ్లలో 8 మంది ఐపీఎల్ ఆడుతున్నారు. వీరిలో మార్క్‌రమ్ (లక్నో సూపర్ జెయింట్స్), కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్), వియాన్ ముల్డర్ (సన్ రైజర్స్ హైదరాబాద్), ర్యాన్ రికెల్‌టన్ (ముంబై ఇండియన్స్), కార్బిన్ బాస్ (ముంబై ఇండియన్స్), లుంగి ఎంగిడి (ఆర్సీబీ), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్), మార్కో జాన్సెన్ (పంజాబ్ కింగ్స్) వంటి ఆటగాళ్లు ఉన్నారు. సౌతాఫ్రికా బోర్డు నిర్ణయంతో వీరంతా తమ ఐపీఎల్ జట్లకు మ్యాచ్‌లు పూర్తయ్యేంతవరకు అందుబాటులో ఉండనున్నారు.