టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన స్పిన్ మాస్టర్ హర్భజన్ సింగ్.. తనదైన శైలితో అభిమాన హృదయాల్లో చెరగని ముద్ర వేసాడు. బంతిని చక్కగా తిప్పి ప్రత్యర్థులను భయపెట్టడమే కాదు.. అవసరమైనప్పుడు బ్యాటుతోనూ మ్యాచ్ లు గెలిపించాడు భజ్జి. ఇప్పుడు అతని బౌలింగ్ మెజిక్, క్రికెట్ ప్రయాణం వెండితెరపైకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన జీవితాన్ని సినిమాగా తీస్తే తప్పకుండా చూడాలని ఉందని చెప్పిన భజ్జీ, తన పాత్రను సెట్ అయ్యే నటుల పేర్లను కూడా వెల్లడించాడు. విక్కీ కౌశల్, రణవీర్ సింగ్. ఈ ఇద్దరిలో ఎవరైనా తన పాత్ర పోషిస్తే మళ్లీ ఆ క్షణాలను తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.
రణవీర్ సింగ్ ఇప్పటికే ‘83’ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆ చిత్రంలో ఆటతీరు, మాట్లాడే విధానం, హావభావాలు అన్నీ కపిల్ లాంటి ఫీల్ ఇచ్చాయి. సినిమా పెద్ద హిట్ కాకపోయినా, రణవీర్ నటనకు మాత్రం అందరి మెచ్చుకోలు దక్కింది. ఇంకొవైపు విక్కీ కౌశల్… ‘ఛావా’ వంటి సీరియస్ పాత్రను సజీవంగా తీర్చిదిద్దిన నటుడు. తక్కువ డైలాగ్స్, కానీ ఎక్కువ భావాలతో క్యారెక్టర్‌కి జీవం పోశాడు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటాడు.
ఇప్పుడు వీరిలో ఎవరు హర్భజన్ పాత్ర పోషిస్తారో చూడాలి. విక్కీ తన లోతైన నటనతో ఆకట్టుకుంటాడా? లేక రణవీర్ తన ఎనర్జీతో ప్రేక్షకుల మనసు దోచుకుంటాడా? అనేది ఆసక్తికర విషయమే. కానీ ఓ విషయంలో మాత్రం స్పష్టత ఉంది—హర్భజన్ కథ వెండితెరపైకి వస్తే, అది కచ్చితంగా క్రికెట్ అభిమానులనే కాదు, సినిమా ప్రేక్షకులనూ అలరిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.