కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లా ఓ హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. మామూలుగా కనిపించిన క్రికెట్ బాల్ వివాదం కత్తిపోట్ల వరకూ వెళ్లింది. ఓ యువకుడు, ఓ స్కూల్ టీచర్ మధ్య జరిగిన మాటల యుద్ధం.. రక్తపాతం దాకా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే… బాగల్కోట్లో మంగళవారం క్రికెట్ ఆడుతున్న యువకుల బంతి ఓ ఇంట్లో పడింది. ఆ ఇంట్లో ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న రామప్ప పూజారి అనే 36 ఏళ్ల వ్యక్తి నివసిస్తున్నారు. బాల్ తీసుకురావడానికి 21 ఏళ్ల పవన్ జాదవ్ అనే యువకుడు ఇంట్లోకి వెళ్లాడు. కానీ రామప్ప బాల్ రాలేదని చెప్పాడు. ఈ వ్యవహారం వాగ్వాదం గా మారింది. మాటలు మారీ ముదిరాయి.
కొంతసేపటికే పవన్ ఆగ్రహంతో రగిలిపోయి రామప్పపై దాడికి దిగాడు. మొదట గుద్దులు, తర్వాత విరిగిన బాటిల్, చివరికి కత్తితో తీవ్రంగా పొడిచాడు. ఈ దాడిలో రామప్ప ముఖం, తలపై తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతను ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో బయటపడడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. ఒక క్రికెట్ బాల్ కోసం ఇలా ఒకరి ప్రాణాల మీదికి రావడం చూసి స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.