విజయవాడలో శుక్రవారం నిర్వహించిన తిరంగా యాత్రకు మంచి స్పందన వచ్చింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం, జనసేన కూటమి ఈ ర్యాలీకి నేతృత్వం వహించింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు జరిగిన ఈ దేశభక్తి ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, మంత్రులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, దేశం విభజించబడిన తర్వాత కూడా శాంతిని చూళ్ళేకపోయామని వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని వెనక్కి లాగాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ముంబై దాడుల్లో కసబ్ చేసిన హింస, గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్ పేలుళ్లలో జరిగిన విషాదం మనం మరచిపోలేం అని తెలిపారు. ఇక పాకిస్తాన్కు సంబంధించి పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కు శాంతి సందేశాలు పనికిరావు. అవసరమైతే వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడతాం.. అంటూ స్పష్టం చేశారు. సైనికులు ఎలాంటి వాతావరణంలో దేశాన్ని కాపాడుతున్నారో ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. వారికీ ధైర్యం చెప్పే విధంగా ప్రజలు, నేతలు ఉండాలని పిలుపునిచ్చారు.
మురళీనాయక్ గురించి మాట్లాడుతూ ఒక్క భారత్ మాతాకీ జై అన్నందుకు ప్రాణాలు కోల్పోయిన మురళీనాయక్ వంటి వీరులకు జైహింద్ చెబుదాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని పవన్ కల్యాణ్ చెప్పారు. సినీ రంగంపై కూడా స్పందించిన ఆయన సెలబ్రిటీలు దేశభక్తిపై మాట్లాడకపోతే ఆశ్చర్యపోనవసరం లేదు. వాళ్లు ఎంటర్టైనర్స్ మాత్రమే. దేశం గురించి మాట్లాడరన్నారు.. బాలీవుడ్, టాలీవుడ్ నటుల నిర్లక్ష్యాన్ని గమనించాల్సిన అవసరం ఉందని సూచించారు. మొత్తానికి, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు శాంతి పరంగా కాకుండా ప్రతీకార ధోరణిలో ఉండటంతో, ఈ యాత్ర రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.