ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ (ISIS) అనుమానిత ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు అరెస్ట్ చేశారు. ఇండోనేషియాలోని జకార్తా నుంచి భారత్కు వచ్చిన ఐసిస్ సభ్యులు అబ్దుల్లా ఫయాజ్ షేక్, తల్హా ఖాన్లను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను NIA ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు. శుక్రవారం రాత్రి విమానాశ్రయంలోని టెర్మినల్ 2 వద్ద అనుమానాస్పదంగా కనపడటంతో ఇమిగ్రేషన్ బ్యూరో అధికారులు వీరిని అడ్డుకున్నారు.
ఐసిస్ సానుభూతిపరులైన వీరు 2023లో ఉగ్రవాదుల కోసం పూణేలోని ఐఈడీలు, ఇతర పేలుడు పదార్థాలను తయారుచేసినట్లు గుర్తించారు. ఇదే కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేయగా.. వీరిద్దరు మాత్రం పరారీలో ఉన్నారు. తాజాగా ఇండియా తిరిగి రావడంతో అదుపులోకి తీసుకున్నారు. వీరి సమాచారం ఇస్తే ఒక్కొక్కరికి రూ. 3 లక్షల రివార్డు ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది.