హైదరాబాద్ పాతబస్తీలోని మీర్‌చౌక్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నిన్న జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 17 కు చేరింది. వీరిలో ఎనిమిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం హృదయాన్ని కలిచివేస్తోంది. మృత చిన్నారుల్లో ఒకటిన్నరేళ్ల వయస్సున్న శిశువు కూడా ఉన్నాడు.. ఆరుగురు పిల్లల వయస్సు నలుగేళ్లలోపే కాగా.. ఒ పిల్లవాడి వయసు 7 సంవత్సరాలుగా తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో నలుగురు వృద్ధులు (వయస్సు 60 నుంచి 75 సంవత్సరాల మధ్య), మరో ఐదుగురు 30 నుంచి 40 ఏళ్ల వయస్సు వారూ ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించడం.. అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడం, భవనంలో చిక్కుకున్న వారిని వెంటనే బయటకు తీయలేకపోవడం వల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేసింది. మృతదేహాలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టుమార్టం అనంతరం మృతుల దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ స్థాయిలో తక్షణ సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరుపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.