హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఆదివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 6 గంటల సమయంలో భవనం మొదటి అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. బాధితులను వెంటనే ఉస్మానియా, యశోద, డీఆర్డీవో, అపోలో ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ మరికొంతమంది అక్కడే మృతిచెందారు.
ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ, పోలీస్ శాఖలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. దాదాపు 10 అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాయి. పక్కన ఇళ్లకు మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల నివాసితులు భయభ్రాంతులకు గురయ్యారు. పొగ తీవ్రంగా వ్యాపించడంతో స్థానికులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఈ ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 30 మంది ఉన్నారు. సహాయక బృందం 10 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. అయితే మిగతా వారు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. నాలుగు కుటుంబాల సభ్యులు ఈ ప్రమాదంతో తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు.
క్షతగాత్రులకు రూ. 50,000 పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టి బాధితులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పొన్నం ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ దుర్ఘటనతో పాతబస్తీ ప్రజల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడింది. ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.