తెలుగు చిత్ర పరిశ్రమలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య నెలకొన్న వాణిజ్య తగాదాలు మరింత ముదిరాయి. థియేటర్లలో సినిమాలను పర్సెంటేజ్ పద్ధతిలోనే ప్రదర్శించాలన్న డిమాండ్‌తో ఎగ్జిబిటర్లు మరింత ఉగ్రంగా మారారు. తాజా గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఈ సమావేశానికి సురేష్ బాబు, దిల్ రాజు లాంటి ప్రముఖ నిర్మాతలు కూడా హాజరయ్యారు.
ఈ సమావేశంలో ప్రస్తుత అద్దె పద్ధతి వల్ల తమకు నష్టాలు వస్తున్నాయని, థియేటర్లు నడపలేని స్థితికి వచ్చామని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ల నిర్వహణ పర్సెంటేజ్ పద్ధతిలో జరిగితేనే తాము సినిమాలను ప్రదర్శిస్తామని తేల్చిచెప్పారు. అందుకోసం నిర్మాతలకు ఓ లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లలో ఈ విధానం అమలులో ఉండగా, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రం అద్దె సిస్టం కొనసాగుతోంది. దీనివల్ల పెద్ద సినిమాలు విడుదలైనపుడు కూడా నష్టాలు తప్పట్లేదని ఎగ్జిబిటర్లు వాపోయారు.
ఈ పరిణామాల మధ్య జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు మూసివేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు నిర్మాతల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు ఫిల్మ్ ఛాంబర్ సిద్ధమైంది. అయితే ఈ సమావేశానికి ఇండస్ట్రీలోని ఇతర ప్రముఖ నిర్మాతలు హాజరు కాకపోవడం గమనార్హం. ఇక జూన్ నెలలో విడుదల కానున్న పెద్ద సినిమాలపై ఈ పరిస్థితి తీవ్ర ప్రభావం చూపనుంది.
ముఖ్యంగా పవన్ కల్యాణ్ నటించిన “హరిహర వీరమల్లు” జూన్ 12న విడుదల కావాల్సి ఉంది. నాగార్జున, ధనుష్ కలయికలో రూపొందుతున్న “కుబేర” జూన్ 20న విడుదల కానుంది. అలాగే మంచు విష్ణు భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “కన్నప్ప” జూన్ 27న థియేటర్లలోకి రావాల్సి ఉంది. జులై 4న విజయ్ దేవరకొండ “కింగ్‌డమ్” రిలీజ్ షెడ్యూల్‌లో ఉంది. ఈ సినిమాలన్నీ థియేటర్ బంద్ వల్ల ఏం అవుతాయో తెలియని పరిస్థితి. మరి దీనిపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. పరిశ్రమలో ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది? అన్నదే ప్రేక్షకుల్లో పెద్ద ప్రశ్నగా మారింది.