హైదరాబాద్ గుల్జార్హౌజ్ ప్రాంతంలో చోటుచేసుకున్న భయంకర అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే సీఎం స్పందించారు. అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులతో నిరంతరం ఫోన్లో మాట్లాడుతూ సహాయక చర్యలను సమీక్షించారు. సహాయక చర్యలు వేగంగా జరగాలని, బాధితులకు తక్షణమే వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు, అధికారులు ఘటన స్థలానికి వెంటనే వెళ్లాలని సూచించారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఐజీ నాగిరెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి వారు వీరితో ఫోన్‌లో మాట్లాడి, అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు.
ఈ ప్రమాదానికి అసలైన కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు లోతైన దర్యాప్తు జరిపించాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు భద్రతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉన్నట్లు సీఎం అన్నారు. మంటల్లో చిక్కుకున్నవారిలో చాలామందిని ఫైర్ సిబ్బంది సమయోచితంగా స్పందించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దాదాపు 40 మందిని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించగలగటం పట్ల సీఎం ఫైర్ టీమ్‌ను అభినందించారు. ప్రమాద తీవ్రతను తగ్గించటంలో వారు చూపిన ధైర్య సాహసం ప్రశంసనీయమని కొనియాడారు.