టీ20 క్రికెట్‌లో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. ఇప్పటి వరకు ఈ ఘనత విరాట్ కోహ్లీ పేరిట ఉండగా, రాహుల్ అతడి రికార్డును చెరిపేశాడు. కోహ్లీ 243 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకోగా, రాహుల్ మాత్రం కేవలం 224 ఇన్నింగ్స్‌లలోనే 8 వేలు పరుగులను అందుకున్నాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో రాహుల్ ఈ ఘనతను నమోదు చేశాడు. కాగా, ప్రపంచవ్యాప్తంగా టీ20ల్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో బాబర్ ఆజమ్ (218 ఇన్నింగ్స్‌లు), క్రిస్ గేల్ (221 ఇన్నింగ్స్‌లు) రాహుల్ కంటే ముందు ఉన్నారు. రాహుల్ తర్వాత విరాట్ కోహ్లీ (243), మహ్మద్ రిజ్వాన్ (244) స్థానాలు ఉన్నారు.
ఈ ఘనతతో మరోసారి రాహుల్ తన ఆటతీరుతో అభిమానులను మెప్పించాడు.