వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్(Nandigam Suresh) ఆదివారం సాయంత్రం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను మంగళగిరి కోర్టులో హాజరుపరచగా జూన్ 2వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. కోర్టులో హాజరుపరచడానికి ముందు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సురేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో టీడీపీ కార్యకర్త రాజుపై నందిగం సురేశ్, ఆయన సోదరులు దాడికి పాల్పడ్డారు. దీంతో రాజు ఫిర్యాదు మేరకు సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే సురేష్‌పై 12 కేసులు ఉన్నాయని, అందులో హత్య కేసు కూడా ఉందని తూళ్లూరు డీఎస్పీ పేర్కొన్నారు. బెయిల్ మీద బయట ఉన్నప్పటికీ మళ్లీ తీవ్రంగా దాడికి పాల్పడటంతో అతడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మిగిలిన నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. కాగా కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని కేసుల్లో అరెస్ట్ అయిన సురేశ్ ఐదు నెలల పాటు జైలులో ఉన్న సంగతి తెలిసిందే.