పాదాల్లో వాపు వస్తుంటే చాలా మంది దానిని పెద్ద సమస్య కాదని వదిలేస్తుంటారు. అయితే ఇలా తరచూ వస్తే తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మన శరీరం ఎక్కడైనా సమస్య తలెత్తినప్పుడు, అది కొన్ని సంకేతాల రూపంలో మనకు ముందుగానే తెలియజేస్తుంది. అందులో ముఖ్యమైనదే కాళ్ల వాపు. దాన్ని పట్టించుకోక పోవడం మంచి ఆలోచన కాదు. ఎందుకంటే ఇది అనేక తీవ్రమైన సమస్యలకు సూచనగా ఉండొచ్చు.
ఒకవేళ మన కాలేయం సరిగ్గా పని చేయకపోతే శరీరంలోని ప్రోటీన్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల కాళ్లలో ద్రవం పేరుకుపోయి వాపు వస్తుంది. ఇది లివర్ సిర్రోసిస్ లాంటి కాలేయ సంబంధిత వ్యాధులకు సంకేతంగా ఉండొచ్చు. అలాగే మూత్రపిండాల పనితీరు కూడా చాలా కీలకం. అవి సరిగా పని చేయకపోతే, శరీరంలో ఉండాల్సినంత ద్రవం బయటకు వెళ్లదు. దీంతో పాదాల్లో ద్రవం పేరుకుపోయి వాపు వస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.
కొంతమందికి థైరాయిడ్ సమస్యల వల్ల కూడా ఈ వాపు వస్తుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారిలో ఇది సాధారణం. శరీరంలో నీటి సమతుల్యత తప్పిపోయి ద్రవం పేరుకుపోతుంది. అలాగే గుండె బలహీనంగా పని చేస్తే, రక్తం శరీరంలోని అన్ని భాగాలకు సమంగా వెళ్లదు. దాంతో కాళ్లలో ద్రవం నిలిచిపోతుంది. ఈ పరిస్థితి కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్‌ను సూచించవచ్చు.
షుగర్ ఉన్నవారిలో రక్త ప్రసరణ బాగుండదు. దాంతో పాదాల్లో వాపు, మంటలు రావడం సర్వసాధారణం. అప్పట్లో చికిత్స చేయకపోతే గాయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇతరంగా, గర్భధారణ సమయంలో సిరలపై ఒత్తిడి పెరగడం వల్ల, ఎక్కువసేపు నిలబడటం లేదా కూర్చోవడం వల్ల కూడా వాపు వస్తుంది. ఎడెమా అనే పరిస్థితిలో కణజాలాల్లో ద్రవం పేరుకుపోయి వాపు ఏర్పడుతుంది. ఇది కూడా ప్రమాదకరమే.
ఇక ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని మార్పులు అవసరం. ముఖ్యంగా రోజు వ్యాయామం చేయడం, శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. ఎందుకంటే ఎక్కువ సాల్ట్ శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. దీని వల్ల వాపు పెరుగుతుంది. పాదాలను కొద్దిగా ఎత్తులో పెట్టి ఉంచితే రక్తప్రసరణ మెరుగవుతుంది. రోజూ తగినంత నీళ్లు తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు పోతాయి. ఇవన్నీ పాటించి కూడా సమస్య మెల్లగా తగ్గకపోతే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాట వాస్తవం కాబట్టే… శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను కూడా గమనించడం తప్పనిసరి.