కొత్తగా రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) స్పష్టం చేశారు. మ్యారేజ్ సర్టిఫికెట్, పెళ్లికార్డు, పెళ్లి ఫొటో అవసరం లేదన్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేయొద్దని చెప్పారు. దరఖాస్తుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లో దాన్ని పరిష్కరిస్తామని తెలిపారు. 4.24 కోట్ల మందికి జూన్‌లో ఉచితంగా రేషన్‌కార్డులు జారీ చేస్తామన్నారు.
ప్రభుత్వం సామాన్యుడికి అందుబాటులో ఉంటూ సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకెళ్తోందని చెప్పారు. క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ రైస్‌కార్డు ఇస్తామని తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా కుటుంబసభ్యులు ఎవరైనా రేషన్‌కార్డులో యాడ్ చేసుకోవచ్చని తెలిపారు. తొలగింపునకు మాత్రం మరణించిన వారి పేర్లనే ప్రస్తుతానికి పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్డులో ‘హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ’ మార్చేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. తప్పుడు వివరాలను సరిచేసేందుకు తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కరించేందుకు వెసులుబాటు కల్పించామని నాదెండ్ల వెల్లడించారు.