ఐపీఎల్లో భాగంగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నోసూపర్ జెయింట్స్(LSG) జట్టు గురువారం గుజరాత్ టైటాన్స్(GT)పై విజయం సాధించన సంగతి తెలిసిందే. లక్నో విజయం పట్ల ఆ జట్టు యజమాని సంజీవ్ గొయెంకా(Sanjiv Goenka) ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు.
‘తిరిగి విజయాల బాట పట్టినందుకు లక్నో జట్టు, కెప్టెన్ రిషబ్ పంత్‌కు అభినందనలు. లక్నో కుటుంబంలోని కొత్త సభ్యుడు విలియం ఓరూర్కే అద్భుతమైన ప్రదర్శన చేశాడు. లావెండర్లో అడుగు పెట్టే సంప్రదాయాన్ని కొనసాగించడానికి గుజరాత్ చేసిన స్ఫూర్తిదాయకమైన చొరవ, క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటంలో క్రీడ మనల్ని ఏకం చేయగలిగే శక్తివంతమైన వేదిక’ అని గొయెంకా రాసుకొచ్చాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టులో మిచెల్ మార్ష్ (117; 64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (27 బంతుల్లో 56 పరుగులు), రిషబ్ పంత్ (6 బంతుల్లో 16 పరుగులు) తమ వంతు పాత్ర పోషించారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్, అర్షద్ ఖాన్లు చెరో ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ బ్యాటర్లలో షారుక్ ఖాన్ (57) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్‌మన్ గిల్ (35), జోస్ బట్లర్ (33), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (38) లు పర్వాలేదనిపించారు. లక్నో బౌలర్లలో విలియం ఓరూర్క్ మూడు వికెట్లు తీయగా.. అవేశ్ ఖాన్, ఆయుష్ బదోనిలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన లక్నో జట్టు తన చివరి మ్యాచ్‌ను మే 27న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.