Saturday, May 24, 2025
Homeఓపన్ పేజ్బహుజన బిగ్‌ బి

బహుజన బిగ్‌ బి

ఎవరో ఒకరు..ఎపుడో అపుడు.. నడవరా ముందుకు అటో ఇటో ఏటో వైపు అని ఓ సినీ కవి అన్నట్టు అప్పికట్ల భరత్‌ భూషణ్‌ అలియాస్ బిగ్‌ బి ఒక్కడై కదిలారు. తాను ఎదిగి వచ్చిన సమాజంవైపే నడిచారు. బాబాసాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అడుగు జాడల్లో ‘పే బ్యాక్‌ టు సొసైటీ’ కోసం అతడే ఒక సైన్యమై కదిలారు. ఫలితంగా నేడు ఎంతో మంది ఆయన వల్ల, ఆయన సాయం వల్ల, ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ల చొరవతో తెలుగు రాష్ట్రాల్లో వేలాదిమంది ప్రయోజ కులయ్యారు. ఆయనది పరిపూర్ణమైన జీవితం. భారత రైల్వేలో ఆయన పొందింది పదవీ విరమణ మాత్రమే.. తన సేవాతత్పరతకు కాదు.

- Advertisement -

దాదాపు 12 ఏళ్ల కిందట ఓ సాయంత్రం పూట.. స్నేహితురాళ్లయిన ఎస్సీ వర్గానికి చెందిన అమ్మాయి, రెడ్డి వర్గానికి చెందిన అమ్మాయి ఐఆర్టీఎస్ రిటైర్డ్‍ అధికారి అప్పికట్ల భరత్‌ భూషణ్‌ ఇంటికొచ్చారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల తాను గ్రూప్‌–2 లాంటి ప్రభుత్వ పరీక్షలకు కోచింగ్‌ పొందలేకపోతున్నానని ఎస్సీ అమ్మాయి ఆయన దగ్గర వాపోయింది. ఆయన అప్పటికప్పుడు తనకు తెలిసిన వాళ్లతో మాట్లాడి తలా ఇన్ని డబ్బులేసుకొని హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్రోడ్‌లోని ఓ ప్రముఖ కోచింగ్‌ సెంటర్లో చేర్పించడానికి ఓకే చేశారు. ఆ అమ్మాయితోపాటు వచ్చిన మరో అమ్మా యి పరిస్థితి కూడా దాదాపు అదే. కానీ ఆ విషయం బయటకు చెప్పలేకపోయింది. ఆ అమ్మాయి పరిస్థితిని ఆయన పసిగట్టి ఆరా తీశారు. ‘సర్‌, నేను రెడ్డి అమ్మా యిని. మీరు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మాత్రమే హెల్ప్‍ చేస్తారని అనుకుంటున్నాను. అందుకే ఏమీ చెప్పలేకపోయాను’ అంది. దానికి ఆయన చిన్న నవ్వు నవ్వి ‘అలా అని ఎవరు చెప్పారమ్మా. ఏ కులంలో ఉన్నా పేదోళ్లు పేదోళ్లే. పైగా అవసరం కోసం వచ్చిన వారి కులమతాలు నేను పట్టించుకోను’ అని అప్పటి కప్పుడు ఎస్సీ అమ్మాయికి మాట్లాడిన కోచింగ్‌ సెంట ర్లోనే ఆమెకూ సీటు ఇప్పించారు.

సీన్‌ కట్‌ చేస్తే కొంతకాలం తర్వాత అర్థరాత్రి భరత్‌ భూషణ్‌కు ఒక ఫోన్‌ వచ్చింది. లిఫ్ట్‍ చేస్తే అవతల వైపు నుంచి ఆ రెడ్డి అమ్మాయి తండ్రి. భరత్‌ భూషణ్‌ కాస్త కంగారు పడ్డారు. విషయమేంటని అడిగారు. అప్పుడాయన చెప్పాడు ‘అయ్యా, మేం కులానికి రెడ్లమే కావచ్చు కానీ పేదోళ్లం. దానిమూలంగా మాకు ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. స్నేహితురాలితో వచ్చినందుకు నా బిడ్డ అవసరాన్ని కనుక్కొని మరీ సాయం చేశారు. నా బిడ్డ పంచాయతీ సెక్రటరీగా స్టేట్‌ టాపర్‌గా నిలిచింది. నా బిడ్డను మీ బిడ్డగా పెంచారు. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు’ అన్నాడు.

2020లో మరో సంఘటన. కొవిడ్‌–19 విజృంభణతో ఎక్కడికక్కడ లాక్‌డౌన్‌.. పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లలేని పరిస్థితులున్నప్పటికీ 65 ఏళ్ల వయసులో భరత్‌ భూషణ్‌ తన నెట్‌వర్క్‍ని కదిలించి రూ.10 లక్షలు పోగేసి ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీ లకు ఆహారం, చెప్పులు, బట్టలు వంటి సౌకర్యాలు కల్పించారు. ఇతరుల సహకారంతో రెండు ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేసి హైదరాబాద్లో చిక్కుకున్న కూలీలను సొంత ప్రాంతాలైన గోరక్పూర్‌, జార్ఖండ్‌కు వెళ్లే ఏర్పాటు చేశారు. మరో రూ.5 లక్షలు సమకూర్చి ములుగు జిల్లాలోని మూడు ఆదివాసీ గూడెల్లోని ప్రజలకు బట్టలు, దుప్పట్లు, మెడిసిన్‌, చెప్పులు, రెయిన్‌ కోట్లు, పిల్లలకు నోటు బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు వంటివి అందజేశారు.

మూడో సంఘటన..1975–77లలో భరత్‌ భూషణ్‌ ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చేస్తున్న రోజుల్లో.. జ్ఞానప్రకాశ్‌ అనే కాలేజీమేట్‌ తెనాలిలోని ఆరోగ్యభవన్‌ అనే హోటల్లో సర్వర్‌గా పని చేస్తూ, రాత్రి పూట రిక్షా తొక్కుతూ చదువుకునేవాడు. ఆయన తిరిగి ఆరోగ్యభవన్‌ వెళ్లే పరిస్థితి తలెత్తకుండా తన ఫ్రెండ్స్‍తో కలిసి అతని ఆర్థిక అవసరాలు తీర్చి, ఉన్నతవిద్య పూర్తి చేసేలా తోడ్పడ్డారు.

మొదటి సంఘటనలో కులాలకు అతీతంగా ఆడబిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే తరాలే మారిపోతాయని అండగా నిలిచారు. రెండో సంఘటన రిటైరయ్యాక కూడా వయసు, శరీరం సహకరించక పోయినా ఆపదలో ఉన్నవారికి తనవంతుగా తోడ్పాటు అందించారు. ఇక మూడోది స్నేహితుడి చదువు ఆగిపోకుండా, అతని ఉన్నతికి బాటలు వేశారు. ఈ మూడు సంఘటనలు చాలు భరత్‌ భూషణ్‌ అంటే ఎవరు అని చెప్పడానికి. ఆయన నాయకత్వం, క్యారెక్టర్‌ ఏంటో పరిచయం చేయడానికి ఇవి చాలు. పదవిలో ఉన్నా, పదవి లేకపోయినా పేదల కోసం తపించే ఆయన బహుజన వర్గాలకు బిగ్‌ బి (బిగ్‌ బ్రదర్‌). తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా బహుజన వర్గాల్లో ఆయన పరిచయమే అక్కర్లేదు. భరత్‌ భూషణ్‌ పేరులో మొదటి అక్షరాలు కూడా బీబీనే. అందుకే పేదవర్గాలు ఆయన్ను ప్రేమగా బిగ్‌ బి (పెద్దన్న)గా పిలుచు కుంటాయి. రాజ్యసభ ఎంపీ (1949–52)గా, ఎమ్మె ల్సీ (1966–72)గా పని చేసిన దివంగత అప్పికట్ల జోసెఫ్‌, మార్తమ్మల మొదటి సంతానం బీబీ. వీరి స్వస్థలం విజయవాడ. జోసెఫ్‌ స్వతంత్ర సమర యోధుడు. ఆయన బతికున్నన్ని రోజులు పేద పక్ష పాతిగా జీవించారు. నాటి ఉప ప్రధాని జగ్‌జీవన్‌ రాంతో ఆయనకు మంచి సాన్నిత్యం ఉండేది. జోసెఫ్‌ విజయవాడ పరిసరాల్లో వేలాది మందికి ఇళ్ల పట్టా లిప్పించారు. ఆ రోజుల్లోనే సొంత ఖర్చులతో ప్రైమరీ స్కూల్‌ స్థాపించారు. అది దాదాపు 57 ఏళ్లపాటు పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పింది. తండ్రి సేవాగుణాన్ని పునికిపుచ్చుకున్న బీబీ చిన్నప్పటి నుంచే పట్టుదల మనిషి. తొలి ప్రయత్నంలో పదో తరగతి ఫెయిలయ్యా రు. అయినా కుంగిపోకుండా మరో పాఠశాలలో చేరి పది మళ్లీ చదివి పాసయ్యారు. విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ చదువుకున్నారు. తన ప్యాకెట్‌ మనీతో పాటు స్నేహితుల దగ్గర సేకరించిన డబ్బుతో అక్కడ చదువుకునే పేద వర్గాల పిల్లల ఫీజులు చెల్లిస్తూ డ్రాప వుట్లు కాకుండా చేసేవారు. సివిల్‌ సర్వెంట్‌గా చేరక ముందు ఆయన జనరల్‌ ఇన్సూరెన్స్‍ లో కొంతకాలం పని చేశారు బీబీ. అక్కడ రీజినల్‌ మేనేజర్‌ బీబీపై విపరీతమైన కుల వివక్ష పాటించే వారు. బీబీ ఏమాత్రం కుంగిపోకుండా ఎదురొడ్డి నిలబడ్డారు. నిజానికి అలాంటి వివక్షలే తన వర్గాలకు పక్షపాతిగా ముద్రపడ్డ పర్వాలేదు కానీ ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలనే కసిని ఆయనలో పెంచాయి. అందుకే బీబీ బహుజన వర్గాల పక్షపాతి.

రైల్వేలో గార్డులు, ఇతర చిన్నస్థాయి ఉద్యోగులకు కొన్ని పరీక్షలు నిర్వహించి ప్రమోషన్లు కల్పిస్తారు. అధికారుల నిర్లక్ష్యమో లేక చిన్నస్థాయి కార్మికులు పేద వర్గాలకు చెందినవారనే చిన్నచూపో ఏమో తెలియదు. కానీ, ప్రమోషన్ల ప్రక్రియ ముందుకు సాగక అలాగే రిటైరయ్యేవారు. పేద వర్గాల నుంచి వచ్చిన బీబీ అలాంటి పరిస్థితి చెక్‌ పెడుతూ తాను సికింద్రబాద్‌లో పని చేసిన టైంలో పదోన్నతుల కోసం కిందిస్థాయి ఉద్యోగులకు సెలవులు మంజూరు చేసి మరీ పరీక్షలు నిర్వహించేవారు. అలాంటి పదోన్నతులు పొంది రిటరైనవాళ్లు ఎందరో ఈ రోజులు పెన్షన్‌ తీసుకుం టూ సొంత ఇల్లు కట్టుకొని, పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఎక్కడా రాజీపడకుండా వ్యవస్థలో పేరుకుపోయిన అలసత్వాన్ని ఛేదించిన సిసలైన ఆఫీసర్‌ బీబీ. చిన్నపాటి గవర్నమెంటు కొలువొస్తే చాలు రిటైరయ్యేలోపు ఎంత సంపాదించుకుందామా, ఎంత సర్దుకుందామా అని ఆలోచించే కాలమిది బీబీ నిజాయతీ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఆయన గైడెన్స్‍లో, ప్రోత్సాహంతో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 మంది సివిల్‌ సర్వెంట్లు అయ్యారు. దాదాపు 2 వేల మంది ఇతర గ్రూప్‌–1, గ్రూప్‌–2, టీచర్‌, కానిస్టేబుళ్లు, ఎస్సైలు, బ్యాంకింగ్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. తన చొరవతోపాటు డాక్టర్‌ బాబూరావు వంటివారి సహకారంతో పేద విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరయ్యేందుకు కాచిగూడలో దాదాపు పదేళ్లు ఉచిత హాస్టల్‌ నడిపారు. సివిల్‌ సర్వీసులు, ఇతర ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు ఢిల్లీ, చెన్నై వంటి నగరాలకు వెళ్లే వారికి బస ఏర్పాటు చేయడంతోపాటు రైలు టిక్కెట్లు, భోజన వసతి ఏర్పాటు చేసేవారు.

సామాజిక న్యాయం, రిజర్వేషన్లలో సమాన వాటా కోసం 1994లో ప్రారంభమైన మాదిగ దండోరా ఉద్యమానికి అండదండలందించారు. ఇదే కాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఢిల్లీ కేంద్రంగా చేసే ధర్నాలు, ఆందోళనకు రైల్వే అధికారిగా తనవంతుగా సహకరించారు. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా అతడే ఒక సైన్యంలా తన వారిని ఏకం చేసి బాధితులకు అండగా నిలిచిన సందర్భా లెన్నో. 2012లో ఆధిపత్య వర్గాల దాడికి గురైన శ్రీకాకుళం జిల్లా లక్షీంపేట బాధితులు మూడేళ్లపాటు నిత్యవసర వస్తువులు అందేలా చూశారు. అదే ఏడాదిలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం కోసం పోరాడేం దుకు రెండు రైల్వే కోచ్‌లు ఏర్పాటు చేసి వందలాది మందిని ఢిల్లీకి తీసుకెళ్లి పోరాడారు. ఉమ్మడి మహ బూబ్‌ నగర్‌ జిల్లా పెబ్బేరు మండలంలో ఉత్తరం దిక్కున నివాసమున్న మాదిగల నీడ ఊరి మీద పడకూడదని ఆదిపత్య కులాలు దాడికి దిగితే బాధితులకు పక్షాన పోరాడారు.

బీబీ.. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, కాన్షీరాం, మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలే, సావిత్రిబాయి ఫూలే వంటి మహనీయుల ఆశయాలను పునికిపుచ్చుకొని వారు కలలుగన్న ‘పే బ్యాక్‌ టు సొసైటీ’ అక్షరాల పాటిం చారు. పాటిస్తున్నారు. ఏ కష్టమొచ్చినా, ఏ రాత్రి ఫోన్‌ చేసినా తనకు చేతనైంత సాయపడేందుకు ముందు కొస్తారు ఆయనలాంటి వారు నేడు చాలా అరుదుగా ఉంటారు. ‘ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటేనే ఇన్ని చేశాం. రాజ్యాధికారంలో ఉంటే ఇంకా ఎన్ని చేసేవాళ్లమో’ అని వాపోతుంటారు అప్పుడప్పుడు. ఆ కోణంలోనే మరింత సేవ చేద్దామని 2019లో ఒక రాజకీయపార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. కానీ, ఓటర్లు ఇంత నిజాయతీపరుణ్ని నమ్ముతారా? ఓట్లమ్ముకునే సం స్కృతిలో బీబీ డబ్బులు ఖర్చు పెట్టలేక ఓడిపోయారు. కానీ ఇలాంటి వారు చట్టసభల్లో చట్టమే పేదోడి చుట్టమయ్యేది. ఈరోజు వరకు కష్టాల్లో ఉన్న ప్రజలు, అవసరాల్లో ఉన్న వారికి ఇంకా ఏదో చేయాలని నిరంతరం తపన పడుతుండటం ఆయన సేవా గుణానికి నిదర్శనం.

సివిల్‌ సర్వీసుల్లో చేరాక కట్నకానులతో ముందు కు వచ్చిన వారిని కాదని తనతోపాటు పరీక్షలకు ప్రిపేరైన స్నేహితురాలు నళినిని బీబీ పెళ్లి చేసుకు న్నారు. ఆమె ఎస్బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌గా పని చేసి రిటైరయ్యారు. వారికి ఇద్దరు కొడుకులు. ఇద్దరు సాఫ్ట్‍ వేర్‌ ఇంజినీర్లు. 71వ సంవత్సరం పూర్తి చేసుకొని 72లో అడుగుపెడుతున్నప్పటికీ ఇంకా 27 ఏళ్ల కుర్రాడిలాగే తన జాతులకు ఇంకా ఏదో చేయాలనే తపన పడే లివింగ్‌ లెజెండ్‌ బీబీ నేటి తరానికి ఆదర్శం.

( నేడు భరత్‌ భూషణ్‌ పుట్టిన రోజు )

=========
డాక్టర్‌. మహేష్‌ కొంగర
సీనియర్‌ జర్నలిస్ట్

9866464567

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News