సూర్యూడి ప్రతాపంతో ఉక్కపోతకు గురవుతున్న దేశ ప్రజలకు చల్లని కబురు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) శనివారం కేరళ రాష్ట్రాన్ని తాకాయి. ఈ ఏడాది సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం(IMD) వెల్లడించింది. మరో రెండు మూడు రోజుల్లో ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ సారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం శుభపరిణామం. 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. గతేడాది మే 30న.. 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న, 2023లో వారం రోజులు ఆలస్యంగా జూన్ 8న దేశంలోకి ప్రవేశించాయి. మరోవైపు అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది.