జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పర్యటించారు. పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో పూంచ్ ప్రాంతంలో మరణించిన కుటుంబాలను ఓదార్చారు. వారి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు దెబ్బతిన్న గృహాలను పరిశీలించారు. అనంతరం దాడుల్లో గాయపడ్డ వారిని కూడా కలిసి మాట్లాడారు. అలాగే స్థానికంగా ఉండే ఓ స్కూల్‌కి వెళ్లి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు.
మరోవైపు ఝార్ఖండ్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జూన్ 26న వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆదేశించింది. 2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై రాహుల్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ నేత ప్రతాప్ కటియార్ ఆయనపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ రాహుల్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను తిరస్కరించింది.