ఏపీ ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు(Dil Raju) మీడియాతో మాట్లాడారు. పలు కీలక విషయాల గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు.
‘‘పర్సంటేజ్‌ల విషయంలో ఎగ్జిబిటర్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏప్రిల్‌లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ అంశాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల కష్టాలు మాకు తెలుసు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రెంట్ ఆర్ పర్సంటేజ్ విధానం నడుస్తోంది. మొదటి వారం బాగా రెవెన్యూ వస్తే, రెంట్ ఇస్తున్నాం. సెకండ్ వీక్ కలెక్షన్లు తగ్గగానే పర్సంటేజ్ ఇస్తున్నా. అది వాళ్లకు కష్టమైనదే. అది మా అందరికీ తెలుసు. దీనిపై చర్చిస్తున్నాం. కానీ, ఓ కొలిక్కి రాలేదు. సరిగ్గా అదే సమయంలో ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీని ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. తర్వాత డేట్‌ను వాళ్లు లాక్ చేయలేదు. పర్సంటేజ్ సమస్య ఈస్ట్ గోదావరి నుంచి మొదలై నైజాంకు కూడా వచ్చింది.
నైజాంలో 370 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటే, ఎస్వీసీఎస్ సహా మా వద్ద ఉన్న థియేటర్లు 30 మాత్రమే. ఏషియన్, సురేశ్ కంపెనీలో 90 ఉన్నాయి. 250 థియేటర్లు ఓనర్లు, వాళ్లకు సంబంధించిన వాళ్లు మాత్రమే నడుపుతున్నారు. ‘ఆ నలుగురు’ అంటూ మీడియా ఇష్టం వచ్చినట్లు రాస్తోందని ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నాం. వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. మే 18న జరిగిన ఛాంబర్ మీటింగ్‌లో ఏం జరిగిందో తెలియకుండానే మీడియా వార్తలను ప్రచురించింది. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు చెబితే వద్దని వారించాను.
పవన్ కల్యాణ్(Pawan kalyan) సినిమాలను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. మంత్రి దుర్గేష్ గారు నాకు ఫోన్ చేస్తే థియేటర్లు మూసివేయరని స్పష్టంగా చెప్పా. తప్పుడుగా సమాచారం వచ్చిందని ఆయనకు వివరించా. జూన్, జులై, ఆగస్టు సినిమాలకు కీలక సీజన్. సినిమా వాళ్లకు రెండూ ప్రభుత్వాలు చాలా ముఖ్యం. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానంగా ఉండాలనే సీఎం రేవంత్‌రెడ్డి నన్ను ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా పెట్టారు. కళ్యాణ్‌గారు చెప్పాక పక్కంటికి వెళ్లినంత సులభంగా వెళ్లి పేపర్ పట్టుకొని టికెట్ ధరలు పెంచుకొని వస్తున్నారు. రెండు ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు అండగానే ఉన్నాయి. ఛాంబర్‌లోనే కొట్టుకుంటారు. ఐక్యత లేదు’’ అని దిల్ రాజు వెల్లడించారు.