మరొక్కమారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తెరమీదికి వచ్చింది. గత ఏడాదిన్నరగా అదిగో ఇదిగో అంటూ ఆశావాహ ఎమ్మెల్యేలను ఊరిస్తూ ఉన్న విస్తరణ వారం రోజుల్లో ఖరారు కానున్నదని ఢిల్లీ వర్గాల భోగట్టా. జూన్ రెండు (2025) తెలంగాణ రాష్ట్రవతరణ నాటికి పాత పది జిల్లాలకు మంత్రి పదవులు వస్తాయా? అనేది వేచి చూడాలి. గతంలో గవర్నర్‌తో మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు కూడా ఖరారు అయి అర్ధాంతరంగా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రుల కొలువులపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఢిల్లీలో మంతనాలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌తో ఒక దఫా చర్చలు ముగిశాయి. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు పాత పది జిల్లాలు, సామాజిక వర్గాల సమతుల్యతతో కార్యవర్గం ఏర్పాటు కానున్నది. అయితే దీనిపై పార్టీ నాయకులే పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ వ్యవహారం స్థానిక సంస్థల ఎన్నికల వరకు అందరినీ ఇట్లా ఊరిస్తూనే ఉంటది. అయితే అందరి దృష్టి మాత్రం మంత్రివర్గ విస్తరణపైనే ఉన్నది.
రాష్ట్ర కేబినెట్‌లో ప్రస్తుతం ఐదు ఖాళీలున్నాయి. ఇందులో ముస్లింలకు సంబంధించి ఒక ఖాళీ అట్లాగే ఉంచి మిగతా నాలుగు పదవులను భర్తీ చేస్తారని ప్రచా రం జరుగుతుంది. కామారెడ్డి సీటును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోసం త్యాగం చేసిన షబ్బీర్ అలీ తనకు మంత్రి మండలిలో స్థానం కావాలని కోరుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఓడిపోయిన వారిని కేబినెట్ లోకి తీసుకోకూడదని కాంగ్రెస్ విధానపరమైన నిర్ణయం తీసుకోవడంతో ఆయనకిప్పుడు పదవి వచ్చే అవకాశం లేదు. అట్లాగే ఎమ్మెల్సీగా నామినేట్ అయిన ఆమిర్ అలీఖాన్‌కి పదవి ఇచ్చినట్లయితే హైదరాబాద్ కు ప్రాతినిధ్యం దక్కినట్లవుతుంది గానీ ఆయన అభ్యర్తిత్వం పట్ల పార్టీలో ఏకాభిప్రాయం లేదు. మీదు మిక్కిలి ఆ పదవి మీద కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న ది. ముస్లిం అభ్యర్థికి కచ్చితంగా ఇవ్వాలనుకుంటే తన మిత్రుడు ఫహీమ్ ఖురేషీని మంత్రిగా చేయాలని రేవంత్ రెడ్డి కోరుకుంటారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో 73 ఏండ్లలో (1952లో బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం మొదలు) మొట్టమొదటిసారిగా ముస్లిం మంత్రి లేకుండా 18 నెలలు గడిచిపోయాయి. అయినా ఆ వర్గం నుంచి బలమైన ఒత్తిడి కానీ, ఉద్యమం గానీ లేక పోవడంతో రాష్ట్ర, కేంద్ర నాయకులంతా వారిని ‘లైట్’ తీసుకుంటున్నారు.
మొత్తం నాలుగు మంత్రిపదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు ఒక్కొక్క మంత్రి పదవి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయం జరిగిందని వినికిడి. అయితే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎవరు వెనక్కి పోతారో తెలియదు. మహిళా/బీసీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని విజయశాంతి ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేస్తున్నది. అనూహ్యంగా ఎమ్మెల్సీగా ఎంపికైన విజయశాంతిది తెలంగాణ కాదు, ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా కాదు అని వి.ప్రకాశ్ లాంటి రాజకీయ విశ్లేషకులు విడమరిచి చెబుతున్నా రు. ఈ పరిస్థితుల్లో ఆమెకు మంత్రి పదవి ఇస్తారా? అనేది సందేహమే! అయితే కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమే అనేది జగమెరిగిన సత్యం. ‘తల్లి తెలంగాణ’ పార్టీ పెట్టి కొట్లాడినప్పటికీ ఆమెను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారెవరూ ఆమోదిస్తలేరు.
ఇక బీసీల విషయానికి వస్తే రెండు ప్రధాన సామాజిక వర్గాలు ఒక్క మంత్రి పదవి కోసం శాయ శక్తులా కృషి చేస్తున్నాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా గత యాభై ఏండ్లలో ఏ మంత్రి వర్గమూ ఏర్పడలేదు. కానీ ఆ మార్పు రేవంత్ రెడ్డికే సాధ్యమయింది. జి.రాజారామ్, ఎ.మదన్ మోహన్‌లు మున్నూరు కాపుల తరపున రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సైతం గంగుల కమలాకర్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ నుంచి మూడో ప్రయత్నంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆది శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. అందుకే ఆయన అవసరమున్నా లేకున్నా అవాకులు చవాకులు పేలుతూ మీడియాలో నానుతూ ఉన్నారు. అట్లా గాకుండా కన్‌స్ట్రక్టివ్‌గా మీడియా మేనేజ్‌మెంట్, నాయకులతో సమన్వయం సాధించినట్లయితే అవకాశాలు ఇంకా మెండుగా ఉండేవి. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రభావశీలంగా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం మొన్నటి కులగణనలో తమ జనాభాని తక్కువ చేసి చూపించిందని అందరికన్నా ఎక్కువగా రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శించింది. అగ్గికి ఆజ్యం తోడయినట్లు మంత్రి పదవికి గట్టి పోటీదారు అయిన తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి లోపాయికారిగా కాంగ్రెస్లోని రెడ్లు బయటికి పంపించారనే ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇట్లా మున్నూరు కాపు వర్గం గుర్రుగా ఉన్నది.
తెలంగాణలో పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ బిఆర్‌ఎస్, బిజేపి పార్టీల కన్నా తక్కువ సీట్లను కేటాయించింది. ఆ తక్కువలో మల్లికార్జున ఖర్గే ఆశీస్సులతో మక్తల్ సీటు సాధించుకున్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. గతంలో ఒకసారి రేవంత్ రెడ్డి ముదిరాజ్‌లకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఏ రాజకీయ నాయకుడయినా హామీలను అవసరానుగుణంగానే ఇస్తాడు. దాన్ని సాధించుకోవడానికి ఆయా బాధిత సామాజికవర్గాల నుంచి నిరంతరం ఒత్తిడి, ఉద్యమాలు, ఇంటలెక్చువల్ నరేషన్ ప్రచారంలో పెట్టాల్సి ఉంటుంది. ఒకవైపు రాజకీయంగా అన్ని స్థాయిల్లో ఒత్తిడి పెంచుతూనే, జరిగిన అన్యాయాలపై మేర మీరని ఉద్యమాలు చేయాలి. అంతేగాదు మీడియాలో, మౌత్ టాక్‌లో తమ గురించి మంచిని మందిలో ప్రచారం చేయించగలగాలి. కానీ బీసీల్లోని మెజారిటీ వర్గాలు మంచిని చెవిలో, చెడుని మైక్‌లో చెబుతుంటా యి. దీనికి వ్యతిరేకంగా పని జరగాల్సిన అవసర మున్నది. ఒకానొక సందర్భంలో శ్రీహరి తన జిల్లాకే చెందిన ముఖ్యమంత్రిని సైతం ధిక్కరిస్తూ మాట్లాడిం డు. జనరల్‌గా ఈ ధిక్కరణ పదవులు తేవాలి. కానీ రెడ్ల ఆధిపత్యంలో ఇట్లాంటి ధిక్కారాలు పదవులకు గండి పెడుతాయి. వీటిని అధిగమించడానికి తమ సామాజిక వర్గంలోనైనా 99శాతం మద్దతు కూడగట్ట గలగాలి. ఆ పని శ్రీహరి ఇప్పటికైనా గ్రాస్ రూట్ నుంచి చేసుకుంటూ రావాల్సిన అవసరమున్నది.
నిజానికి 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తా మని అసలు ఎన్నికలే జరపకుండా వెనక్కి పోయిన రేవంత్ రెడ్డి పదవుల్లో సింహ భాగం తమ సామాజిక వర్గానికి కట్టబెడుతున్నారు. మొన్నటికి మొన్న సమాచార హక్కు కమిషన్‌లో ఒక్కరంటే ఒక్క బీసీకి కూడా స్థానం దక్కలేదు. ఇట్లా అన్యాయం జరిగినప్పుడు కనీసం అంతర్గత వేదికల మీదనైనా ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడాలి. నిరసన వ్యక్తంజేయాలి. అది ఎక్కడా జరిగినట్టు కానరాలేదు. ఇక ఎస్సీ వర్గం నుంచి ఇప్పటికే డిప్యూటి ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. అదే సామాజిక వర్గం నుంచి జి.వివేక్ తనకు మంత్రి పదవి హామీ పడిన ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నారు. కాంగ్రెస్ తరపున మాట్లాడే ఏకైక మీడియాగా ఉన్నటువంటి వివేక్‌తో గొడవ పడడానికి కేంద్ర నాయకులు సిద్ధంగా లేరు. అయితే ఇదే సమయంలో మాదిగలకు ఒక మంత్రి పదవి కచ్చితంగా ఇవ్వాలని ఆ సామాజిక వర్గ నాయకులు తమదైన మార్గాల ద్వారా ఒత్తిడి పెడుతున్నారు.
ఎస్టీల్లో బాలు నాయక్ లాంటి లంబాడ నాయకులు పోటీలో ముందు వరుసలో ఉన్నారు. ఆదివాసీల తరపున సీతక్కకు మంత్రి పదవి దక్కడంతో గిరిజనుల ప్రతినిధిగా తమకు మంత్రి పదవిలో భాగస్వామ్యం దక్కుతుందని ఆయన భావిస్తున్నారు. అయితే ఢిల్లీ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి మంత్రి పదవి హామీ ఇస్తుందనే ప్రచారం జరుగుతూ ఉన్నది. అదే నిజమైతే ఇప్పటికే ఇద్దరు మంత్రులున్న నల్లగొండకు మరో రెండు పదవులు దక్కుతాయా? లేదా? అనేది కాలమే తేలుస్తుంది. జానారెడ్డి అడ్డం పడి తన మంత్రి పదవిని అడ్డుకున్నాడని రాజగోపాలరెడ్డి బహిరంగంగానే విమర్శ పెట్టిండ్రు. అయితే ఇప్పుడు ప్రాతినిధ్యం లేని నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డికి పదవి ఇవ్వా లనే డిమాండ్ కూడా గట్టిగా వినబడుతున్నది. జానా రెడ్డి జోక్యంతో రంగారెడ్డి జిల్లా ‘రెడ్డి’కి మంత్రి పదవి దక్కుతుందా అనేది కూడా చర్చనీయాంశంగా ఉన్నది.
నిజానికి ఓసీ సామాజిక వర్గంలో వెలమల నుంచి రెండో పదవి తనకు దక్కాలని అంతేగాకుండా ఉమ్మడి ఆదిలాబాద్‌కు మంత్రివర్గంలో ప్రాతినిధ్యమూ కల్పించి నట్లవుతుందని ప్రేమ్‌సాగర్ రావు తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఒకరిద్దరిని ప్రస్తుత మంత్రి వర్గము నుంచి తొలగించి కొత్తవారికి అవకాశం కల్పిస్తారనే ప్రచారమూ జరుగుతున్నది. అయితే అది కాంగ్రెస్కు మరింత తలనొప్పిగా మారనుంది. మంత్రి వర్గం నుంచి తొలగించిన వారెవ్వరూ చేష్టలుడిగి కూర్చోరు. అది మరింత చేటు చేస్తుంది.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా తమకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నదని నిరూపించు కునేందుకు కనీసం రెండు మంత్రిపదవులు బీసీలకు కేటాయించాలి. బీసీల జనాభా 46శాతం (ముస్లింలు మినహా) అని చెబుతున్న కాంగ్రెస్ ఆ మేరకు పదవులు కూడా ఇవ్వాలి. అందులో ముదిరాజ్, మున్నూరు కాపు వర్గాలకు ప్రాతినిధ్యమివ్వాలి. అట్లాగే ఇప్పటికే కుటుంబ పార్టీ అని బీఆర్‌ఎస్ని విమర్శించే కాంగ్రెస్ కోమటిరెడ్డి కుటుంబానికి మరో పదవి ఎట్లా ఇస్తుందో కేడర్‌కు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఆ ప్రజాస్వామ్యం ‘రెడ్ల’కు మాత్రమే వర్తిస్తుందనే ప్రచారం తీన్మార్ మల్లన్న విషయంలో రుజువయింది. ఇప్పటికే బీసీల్లో పట్టు కోల్పోతున్న కాంగ్రెస్ ఈ మంత్రిపదవులతోనైనా దిద్దుబాటలో నడుస్తుందా? వేచి చూడాలి.
రచయిత
(డా.సంగిశెట్టి శ్రీనివాస్)
