ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్(Madan Lal) మృతిపై సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మదన్ లాల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్(CM Revanth Reddy) సానుభూతి తెలియజేశారు.
మదన్ లాల్ మృతి బీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటని కేసీఆర్(KCR) తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మదన్ లాల్ అకాల మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా నాయకుడిగా, ఎమ్మెల్యేగా వైరా నియోజకవర్గ ప్రజలకు విశేష సేవలందించిన మదన్ లాల్ మరణం పార్టీకి, ముఖ్యంగా గిరిజన, బడుగు, బలహీన వర్గ ప్రజలకు తీరని లోటు అన్నారు.
మదన్ లాల్ మృతి పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. మదన్ లాల్ మరణంతో వైరా నియోజకవర్గ బడుగు బలహీనవర్గాలు నిబద్ధత గల నాయకుడిని కోల్పోయారన్నారు.
కాగా ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన మదన్‌లాల్‌ను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ లాల్ బీఆర్ఎస్‌లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.