ప్రతి ఏటా వినాయకచవితి వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ మహా గణపతి(Khairatabad Ganesh) ఉత్సవాలు గురించి మాట్లాడుకోవాల్సిందే. అత్యంత ఎత్తైన, విశిష్టమైన గణపతి ప్రతి ఏటా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అందుకే ఆ మహా గణపతి దివ్యదర్శనం కోసం భక్తులు ఎంతో ఎదురుచూస్తూ ఉంటారు.
అయితే ఆ మహా గణపతిని ప్రతిష్టించేందుకు కనీసం 3 నెలల ముందే ఉత్సవ కమిటీ నిర్వాహకులు పనులు మొదలుపెడతారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది వినాయకుడి విగ్రహం తయారీ కోసం కర్ర పూజ ముహుర్తం ఖరారు చేశారు. జూన్ 6న నిర్జల ఏకాదశి రోజు కర్ర పూజతో పనులు ప్రారంభం కానున్నాయి. అనంతరం విగ్రహం పనులు వేగంగా మొదలవుతాయి.
కాగా ఖైరతాబాద్‌లో మహా గణపతిని 1954వ సంవత్సరలో తొలిసారిగా ప్రతిష్ఠించారు. గతేడాది 70 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఏకంగా 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. మరి ఈ ఏడాది ఎన్ని అడుగులు వినాయకుడి ప్రతిష్టిస్తారోనని భక్తులు ఎదురుచూస్తున్నారు.