ప్రతి ఏడాది మృగశీర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసారం(Fish Prasadam) పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. బత్తిని కుటుంబ సభ్యులు గత 178 సంవత్సరాలుగా దీనిని కొనసాగిస్తున్నారు. ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఈ చేప ప్రసాదం ఉపశమనం కలిగిస్తుందని విశ్వసిస్తారు. దీని కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు నగరానికి తరలివస్తారు. బత్తిని కుటుంబం ఈ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుంది.
ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ చేసే తేదీలు ఖరారయ్యాయి. మృగశీర కార్తె సందర్భంగా జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం అందించనున్నట్లు బత్తిని వంశస్థులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం 5 నుంచి 6 లక్షల మంది వస్తారని ప్రభుత్వానికి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై 21శాఖల అధికారులతో సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి సమీక్ష నిర్వహించారు. నిర్వాహకులు, ఎగ్జిబిషన్ సొసైటీ, ఎన్జీవోలు ఇతర శాఖల అధికారులతో చర్చించారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని అందరూ సమన్వయంతో పూర్తి చేయాలని డీసీపీ ఆదేశించారు.