బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విదేశీ పర్యటనకు బయలుదేరారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ తదితరులు ఉన్నారు.
ఈ పర్యటనలో భాగంగా లండన్, అమెరికా దేశాలకు వెళ్లనున్నారు. ముందుగా లండన్‌లో నిర్వహించనున్న ‘ఇండియా వీక్ 2025’లో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఆ తర్వాత మే 30న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆటోమోటివ్ బ్రాండ్లు.. మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ లకు ఆర్&డి సేవలు అందించే పీడీఎస్‌ఎల్ నాలెడ్జ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించనున్నారు.
లండన్ పర్యటన అనంతరం జూన్ 1న అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. దీనికోసం అక్కడి బీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 2న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్‌లోని భారతీయ విద్యార్థులతో సమావేశమై, నూతన ఆవిష్కరణలు, స్టార్ట్‌అప్స్, భవిష్యత్ భారత నిర్మాణంలో యువత పాత్రపై ప్రసంగించనున్నారు.
కాగా ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మే 28న విచారణకు రావాలని ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.