తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే పసుపు పండగ మహానాడు(TDP Mahanadu 2025) ఈసారి కడప జిల్లాలో అంగరంగవైభవంగా ప్రారంభమైంది. భారీ మెజార్టీతో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో తెలుగు తమ్ముళ్లు భారీగా చేరుకున్నారు. వైసీపీ కంచుకోట, మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల ఉన్న కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తుండటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు(Chandrababu) మాట్లాడుతూ… “తిరుమల తొలిగడప కడపలో ఈరోజు మహానాడు చేసుకుంటున్నాం. దేవుని గడపలో జరిగే ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతోంది. ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు ఏడు స్థానాలు గెలిచి సత్తా చాటాం. ఈసారి ఇంకాస్త కష్టపడితే పదికి పది స్పీప్ చేస్తాం. కడపలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ధన్యవాదాలు తెలపడం కోసమే ఈ మహానాడు నిర్వహిస్తున్నాం” అని తెలిపారు.
“పార్టీ పని అయిపోయిందని అనుకునే వాళ్లకు.. వాళ్ల పని అయిపోయింది. పాలన అంటే హత్య రాజకీయాలు, వేధింపులు, తప్పుడు కేసులు కాదు. విధ్వంసం పేరుతో గత వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రశ్నించిన కార్యకర్తలని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. పీక కోస్తున్నా సరే తోట చంద్రయ్య జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలాడు. ఆయనే మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తే పార్టీని నడిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా కార్యకర్తల్లో అదే జోరు. పార్టీ ఇంతటి విజయాన్ని సాధించిందంటే పసుపు సైనికులే కారణం’ అని చంద్రబాబు వెల్లడించారు.