మహానాడు(Mahanadu) ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీనే అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“మహానాడు… ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగుదేశం’ పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది ఏటా జరిగే మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై… కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు, గౌరవ విద్యాశాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ చంద్రబాబు గారి నాయకత్వములో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, శ్రీ బక్కని నరసింహులు శుభాభినందనలు.
ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న ఈ మూడు రోజుల వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్తే అధినేత, యువ గళం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయం. పసుపు వర్ణంతో ముస్తాబైన మహానాడు ప్రాంగణం శోభాయమానంగా కనువిందు చేస్తోంది. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.” అని పేర్కొన్నారు.