తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మళ్లీ చిరుతల కదలికలు భక్తుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. గతంలో కూడా చిరుతల దాడులతో ప్రాణనష్టం సంభవించిన ఘటనలు ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ విషయంలో అప్రమత్తమైంది. భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని టీటీడీ కార్యనిర్వాహక అధికారి శ్యామలరావు నిపుణులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ఆలయ పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని నిర్ణయించబడింది. ముఖ్యంగా ఆరోగ్య శాఖ సహకారంతో చెత్త తొలగింపు ప్రక్రియను క్రమం తప్పకుండా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అటవీ శాఖ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, విజిలెన్స్ శాఖలతో కలసి అలిపిరి నడక మార్గంలో నిరంతర జాయింట్ డ్రైవ్‌లు నిర్వహించాలని స్పష్టం చేశారు.
చిరుతల ఉనికిని తగ్గించేందుకు, భక్తులపై దాడులను నివారించేందుకు తక్షణ, దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని, ఈ లక్ష్యంతో వన్యప్రాణుల సంస్థ (Wild Life Institute) మరియు అటవీ శాఖల సహాయాన్ని తీసుకోవాలని టీటీడీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆధునిక భద్రతా పరికరాలు వినియోగించేలా చర్యలు ప్రారంభమవుతున్నాయి. కెమెరా ట్రాప్‌లు, స్మార్ట్ స్టిక్స్, బయో ఫెన్సింగ్‌లు, నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చ్‌లు, పెప్పర్ స్ప్రేలు వంటి పరికరాలు భక్తుల రక్షణకు ఉపయోగించనున్నారు.
అలిపిరి మార్గాన్ని చిరుతల నుంచి పూర్తిగా రహితం చేయడమే లక్ష్యంగా టీటీడీ ముందడుగులు వేస్తోంది. నిషేధిత ఆహార పదార్థాల విక్రయంపై నియంత్రణ విధించి, అక్కడి వ్యాపారులకు అవగాహన కల్పించనున్నారు. ఏడవ మైలు నుంచి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వరకు ఉన్న 2.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. మానవ వన్యప్రాణుల మధ్య ఎదురుపడే సంఘటనల నివారణకు ప్రతి నెల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, కొనసాగుతున్న చర్యల పురోగతిని పరిశీలించనున్నారు. తిరుమలలో భక్తులు భయభ్రాంతులకు లోనవకుండా శాంతిగా దివ్యదర్శనానికి వెళ్లేలా టీటీడీ తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది.