తెలంగాణలో వర్షాలు ముందుగానే ప్రారంభమైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. పలు అంశాలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన, వర్షాలపై అధికారులందరూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మున్సిపల్, పోలీసులు, హైడ్రా, విద్యుత్ శాఖల మధ్య సమన్వయం కీలకమని తెలిపారు. ఎలాంటి ఎమర్జెన్సీకి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలని నిర్దేశించారు. వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఇక ఇదే సమావేశంలో ముఖ్యమంత్రి మరో కీలక అంశాలపై కూడా చర్చించారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి ప్రాజెక్టు, రుతుపవనాల సమయంలో సాగు చేసే వానాకాలం పంటలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
వ్యవసాయ శాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీఎం, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల సరఫరా సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా గ్రామాలకెళ్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకోవాలని, పర్యటనలు నిర్వహించాలని సూచించారు. ఈ మొత్తం సమీక్షతో వానాకాలానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం అవుతోంది.