Sunday, June 8, 2025
HomeతెలంగాణTG Cabinet expansion: కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే

TG Cabinet expansion: కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే

కొంతకాలంగా ఊగిసలాడుతూ వస్తోన్న తెలంగాణ మంత్రివర్గ(TG Cabinet) విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీ సామాజిక వర్గం నుంచి వి. శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకట స్వామి, మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు కొత్తగా మంత్రివర్గంలోకి చేరడం ఖాయమైంది. మంత్రివర్గంలో కొత్తగా చేరే ముగ్గురు పేర్లు ఖరారు కావటంతో ఇవాళ రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.20 గంటల మధ్య వీరి ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఉండగా.. మూడు స్థానాలను భర్తీ చేయనున్నారు.

మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు చోటు దక్కడం ఖాయమని కాంగ్రెస్ వర్గాల్లో విస్తృత ప్రచారం జరిగింది. కానీ హైకమాండ్ మాత్రం కేవలం బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రస్తుతం అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో వారికి అవకాశం దక్కలేదని తెలుస్తోంది. అయితే సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుపడుతున్నట్లు సమాచారం. ఇక శాసనసభ ఉప సభాపతిగా రామచంద్రు నాయక్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ గత నాలుగు రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేశారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో విస్తృతంగా చర్చలు జరిపారు. చివరగా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త మంత్రులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినప్పటికీ ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి వద్ద కీలకమైన హోం శాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణ అభివృద్ధి, విద్య, సాధారణ పరిపాలన వంటి శాఖలున్నాయి. ఈ విస్తరణ ద్వారా ఈ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించి, పాలనా భారాన్ని తగ్గించడంతో పాటు, వివిధ శాఖల్లో పనితీరును మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News