దేవాదాయ, అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో శ్రీశైలం దేవస్థానం భూములకు సరిహద్దులు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావులు ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీశైలం ఆలయ భూముల మీద పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చాలా కాలంగా కొనసాగుతున్న శ్రీశైలం భూ వివాదం ఒక పరిష్కారానికి వచ్చిందన్నారు.
శ్రీశైల దేవస్థానం కు చెందిన 4500 ఎకరాల భూమికి స్కెచ్ లతో సహా సరిహద్దులు నిర్ణయించినట్టు తెలిపారు. శ్రీశైల క్షేత్రం శిఖరం, సాక్షి గణపతి, హఠకేశ్వరం, ముఖ ద్వారం వద్ద అభివృద్ది చేయాలని నిర్ణయాలు తీసుకున్నా మన్నారు. పనులకు అవసరమైన 4500ఎకరాల అటవీ భూముల సేకరణకు కేంద్ర అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపించామన్నారు. రాష్ట్రంలో రెండవ ప్రధాన ఆలయం శ్రీశైలం క్షేత్రంను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదేశించారని మంత్రి తెలిపారు.