Monday, June 23, 2025
HomeతెలంగాణTGSRTC FARE HIKED:సామాన్యుడిపై ఆర్టీసీ భారం.. బస్‌ పాస్‌ ఛార్జీల పెంపుతో బెంబేలు!

TGSRTC FARE HIKED:సామాన్యుడిపై ఆర్టీసీ భారం.. బస్‌ పాస్‌ ఛార్జీల పెంపుతో బెంబేలు!

పెరిగిన ధరలు వెనువెంటనే గుదిబండలైతే, సామాన్యుడి కళ్ల నుండి కన్నీరే కడలై పొంగదా? ఒక దాని వెనుక మరొకటి అన్నట్లుగా ధరలు అమాంతం పెరుగుతుంటే, సాధారణ ప్రజల జీవనం పాతాళంలోకి దిగజారిపోదా..? అనుకునేలా రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి.

మెట్రో తర్వాత ఆర్టీసీ షాక్: బస్ పాస్ ధరల పెంపుతో ప్రజల్లో ఆందోళన

TGSRTC FARE HIKED: ఇటీవల మెట్రో రైలు టికెట్ ధరలు పెరిగి సామాన్యులను ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మరో షాక్ ఇచ్చింది. గత మంగళవారం (జూన్ 9) నుండి బస్ పాస్‌ల ఛార్జీలను 20 శాతానికి పైగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలను నిరసిస్తూ విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు, చిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెంపు పెను భారంగా…
తాజాపెంపుతో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్‌లన్నీ ప్రియం కానున్నాయి. ఉదాహరణకు, ఆర్డినరీ పాస్ ధర రూ.1150 నుండి రూ.1400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ.1300 నుండి రూ.1600కు పెరిగాయి. నిత్యం బస్సు ప్రయాణాలపై ఆధారపడే వేలాది మందికి ఈ పెంపు పెను భారంగా మారనుంది.

ఆర్టీసీ ఛార్జీల పెంపు: సామాన్యుడిపై మరో పిడుగు…
మెట్రో ఛార్జీల పెంపుతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజలకు, తాజాగా ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీల పెంపు “నెత్తిన పిడుగు”లా మారింది. జీవన వ్యయం పెరుగుతున్న తరుణంలో, రోజువారీ రవాణా ఖర్చులు ఇలా అమాంతం పెరగడంపై విద్యార్థి, ప్రజా సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయంపై పునరాలోచించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.


హైదరాబాద్, వరంగల్‌లో నెలవారీ బస్‌పాస్‌ల పాత కొత్త ధరలు ఇలా..

4 కిలోమీటర్ల వరకు పాత ధర రూ.150, కొత్త ధర రూ.225
8 కిలోమీటర్ల వరకు పాత ధర రూ.200, కొత్త ధర రూ.300
12 కిలోమీటర్ల వరకు పాత ధర రూ.300, కొత్త ధర రూ.450
18 కిలోమీటర్ల వరకు పాత ధర రూ.390, కొత్త ధర రూ.585
22 కిలోమీటర్ల వరకు పాత ధర రూ.450, కొత్త ధర రూ.675

జిల్లాల్లో ఇలా..

5 కిలోమీటర్ల వరకు పాత ధర రూ.150, కొత్త ధర రూ.225
10 కిలోమీటర్ల వరకు పాత ధర రూ.250, కొత్త ధర రూ.375
15 కిలోమీటర్ల వరకు పాత ధర రూ.300, కొత్త ధర రూ.450
20 కిలోమీటర్ల వరకు పాత ధర రూ.400, కొత్త ధర రూ.600
25 కిలోమీటర్ల వరకు పాత ధర రూ.450, కొత్త ధర రూ.675
30 కిలోమీటర్ల వరకు పాత ధర రూ.500, కొత్త ధర రూ.750
35 కిలోమీటర్ల వరకు పాత ధర రూ.550, కొత్త ధర రూ.825



సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News