Gaddar Film Awards: హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల(Gaddar Awards) ప్రదానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, TFDC ఛైర్మన్ దిల్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం అవార్డు గ్రహీతలకు రూ.5లక్షల నగదుతో పాటు సీల్డ్, ప్రశంసా పత్రం ప్రదానం చేశారు.
ఇక ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా.. నటసింహం నందమూరి బాలకృష్ణ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరో విజయ దేవరకొండ, దర్శకులు సుకుమార్, రాజమౌళి, గుణశేఖర్ నాగ్ అశ్విన్, హీరోయిన్లు రీతూ వర్మ, కృతిక శెట్టి, సీనియర్ నటీమణులు జయసుధ, జయప్రధ, సుహాసిని తదితరులు హాజరై సందడి చేశారు. అలాగే వేడుకలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను కనువిందు చేశాయి.
ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)షేక్ హ్యాండ్ ఇచ్చి అలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే గత డిసెంబర్ లో పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ విచారణకు ఆదేశించారు. దీంతో ఈ ఘటనకు అల్లు అర్జున్ కారణమంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. అనంతరం బన్నీ ఇంటికి వెళ్లి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఓరోజు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ను కావాలనే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని ప్రచారం జరిగింది. తాజాగా గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సం కార్యక్రమంలో అల్లు అర్జున్ కు సీఎం షేక్ హ్యాండ్ ఇచ్చి, హగ్ చేసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Gaddar Awards: అట్టహాసంగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం.. బన్నీని హగ్ చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES