Monday, June 16, 2025
HomeతెలంగాణTGSRTC: తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్ కు మంత్రి పొన్నం అభినందనలు

TGSRTC: తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్ కు మంత్రి పొన్నం అభినందనలు


First Women Driver in TGSRTC: పురుషులకు తామేమి తక్కువ కాదని నేటి మహిళలు నిరూపిస్తున్నారు. తమకు ప్రోత్సాహం అందిస్తే పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తామని చాటి చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ గా సరిత అనే యువతి సత్తా చాటింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సిత్య తండాకు చెందిన వి.సరితకు డ్రైవింగ్ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే ఢిల్లీలోని రవాణా సంస్థలో గత పదేళ్లుగా డ్రైవర్‌గా విధులు నిర్వహించారు.

అయితే కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తనకు స్వస్థలంలో డ్రైవర్‌గా అవకాశం ఇవ్వాలని ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar)ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆమె విజ్ఞప్తితో వెంటనే స్పందించిన పొన్నం.. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి మిర్యాలగూడ డిపోలో JBM సంస్థ నుంచి డ్రైవర్‌గా నియమించారు. దీంతో శనివారం విధుల్లో చేరిన సరిత.. హైదరాద్ నుంచి మిర్యాలగూడకు తొలి బస్సును నడిపారు. ఈ సందర్భంగా తనకు అవకాశం ఇచ్చిన మంత్రి పొన్నంకు సరిత ధన్యవాదాలు తెలిపారు.

తమ ప్రభుత్వం ప్రజాపాలన అందించడంతో పాటు మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు అందించామన్నారు. తాజాగా ఆర్టీసీలో మహిళా డ్రైవర్‌గా అవకాశం ఇవ్వడం జరిగిందని తెలిపారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళా డ్రైవర్ సరితను అభినందించి శుభాకాంక్షలు చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News