M. M. Keeravani: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభర కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన సినిమా గ్రాఫిక్స్ కారణంగా వాయిదా పడింది. ఇంకా కొత్త రిలీజ్ డేట్‌పై క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో విశ్వంభర సినిమా చుట్టూ ఉన్న పరిస్థితి మరింత గందరగోళంగా మారిపోయింది. ప్రస్తుతం షూటింగ్ పరంగా బ్యాలెన్స్ కావలసినది ఒక్క ఐటెం సాంగ్ మాత్రమే. కానీ దానికి సరైన హీరోయిన్ దొరకకపోవడంతో, దర్శకుడు వశిష్ఠ ఇప్పటివరకు ఆ కాస్టింగ్ పై చక్కటి నిర్ణయం తీసుకోలేకపోయినట్టు సమాచారం. దీంతో, ఆ పాట కోసం వేరే ఎత్తుగడలు వేస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్.
మ్యూజిక్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఐటెం సాంగ్‌కు కీరవాణి ఇచ్చిన ట్యూన్ చిరంజీవికి అంతగా నచ్చలేదట. దీంతో ఆయన మరో రెండు, మూడు ట్యూన్స్ ఇచ్చినా కూడా మెగాస్టార్‌ను మెప్పించలేకపోయారు. దీంతో ఐటెం సాంగ్ కోసం కీరవాణి ట్యూన్‌ని కాదని భీమ్స్ సిసిరోలియోకు అవకాశం ఇచ్చినట్టు తాజా సమాచారం. ఈమధ్యే మెగా 157లో ఆయన చేసిన పని చిరంజీవికి బాగా నచ్చడంతో స్వయంగా ఆయనే భీమ్స్‌ను రికమెండ్ చేశారట. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, రికార్డింగ్ త్వరలో జరుగుతుందనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. ఇది నిజంగా కీరవాణికి మెగాస్టార్ ఇచ్చిన షాక్ అని గుసగుసలైతే వినిపిస్తున్నాయి.
ALSO READ: https://teluguprabha.net/news/samantha-tatoo-and-gym-video-goes-viral/
ఇక కీరవాణి ఈ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తప్పుకున్నారన్న దాని వెనుక కారణాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు ఫైనల్ బీజీఎమ్ పనుల్లో బిజీగా ఉన్నారు. జూలైలో విడుదల లక్ష్యంగా పెట్టుకున్న దాంతో, ఆయనకు విశ్వంభర కోసం ప్రత్యేకంగా టైం కేటాయించడం సాధ్యపడలేదు. అందుకే తాత్కాలికంగా భీమ్స్‌ను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, ఇప్పటికే గత ఏడాది వచ్చిన టీజర్‌కు నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిన తర్వాత పబ్లిసిటీ పరంగా సినిమా బాగా వెనుకపడిపోయింది. ఇప్పటికీ సరైన అప్డేట్స్ లేకపోవడం, ప్రమోషన్లు లేకపోవడం మెగా అభిమానుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. వశిష్ఠ ఈ మధ్య ఎక్కడా కనిపించకపోవడం కూడా భిన్నమైన సందేహాలకు దారితీస్తోంది. అదే సమయంలో, అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మెగా 157 రెండో షెడ్యూల్లోకి ప్రవేశించడంతో, విశ్వంభర కంటే ముందే అది విడుదలవుతుందేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. సంక్రాంతి బరిలో రావిపూడి సినిమా ముందుంటుందని ఫ్యాన్స్ తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికైనా టీమ్ స్పీడ్ పెంచకపోతే, విశ్వంభర అంచనాలు మరింతగా తగ్గిపోతాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.