Friday, June 20, 2025
HomeతెలంగాణHarish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఘాటు విమర్శలు

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఘాటు విమర్శలు

Harish Rao Fire on CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి విషయం తక్కువ విషం ఎక్కువ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై నిర్వహించిన ఆల్ పార్టీ ఎంపీల సమావేశంలో రేవంత్ వ్యాఖ్యలకు ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సీఎంకు బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్.. ప్రాజెక్టుల మీద లేదంటూ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి బనకచర్ల ప్రాజెక్టు ఏ బేసిన్‌లో ఉంది అని అడగటం ఏంటని ప్రశ్నించారు. బూతులు తెలుసుకున్నంత సులువు కాదు.. బేసిన్‌ల గురించి తెలుసుకోవడమని విమర్శించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లు పెట్టి మరీ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తమ అజ్ఞానాన్ని బయటపెట్టి పరువు తీసుకున్నారని ఎద్దేవా చేశారు.

- Advertisement -

గోదావరిలో నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు ఇచ్చి ఎంతైనా తీసుకుపో అంటున్నారని.. అది మీ అయ్యా జాగీరా అని ప్రశ్నించారు. రేవంత్ ఏమైనా రాజునా.. ఎలా చెబుతారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వంలో అలా ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. సీఎం మూర్ఖత్వం వల్ల రాష్ట్రం నష్టపోయే పరిస్థితులు వచ్చాయన్నారు. ఏదైనా సబ్జెక్టు మీద మాట్లాడేటప్పుడు మొత్తం తెలుసుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డిలో ఇంకా అడుక్కునే బుద్ధి పోలేదంటూ ఘాటు విమర్శలు చేశారు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి అయితే.. చంద్రబాబు అనే భగవంతుడికి రేవంత్ అనే భక్తుడికి మధ్య ఉన్న అంబికా దర్బార్ బత్తి ఈ ఆదిత్యనాథ్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

నల్లమల అడవి నుంచి వచ్చాను. తొక్కుకుంటూ వచ్చాను.. తోసుకుంటూ వచ్చాను అంటూ రేవంత్ కబుర్లు చెబుతూ ఉంటారని వ్యాఖ్యానించారు. అసలు నల్లమల ఏ ప్రాంతంలో ఉందో ముందు తెలుసుకోవాలని సూచించారు. రేవంత్ నల్లమల బిడ్డ కాదని.. వెకిలి మాటలు మాట్లాడే వెర్రిబిడ్డ విమర్శించారు. బనకచర్ల విషయంలో ప్రభుత్వం మొద్దునిద్ర పోతుంటే.. తాను రెండుసార్లు ప్రెస్‌మీట్ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రికి సోయి వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేయకుండా.. అందరం కలిసి ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుందాం అని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News