Yogandhra Creates Guinness Record: ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర 2025’ కార్యక్రమం గిన్నిర్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. 2015లో ప్రపంచ యోగా దినోత్సం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 10 యోగా దినోత్సవాలు జరిగాయి. 11వ యోగా దినోత్సవం కార్యక్రమం నిర్వహించే బాధ్యత ఏపీ ప్రభుత్వానికి దక్కింది. దీంతో ప్రభుత్వం కొన్ని రోజుల ముందే పకడ్భాందీ ఏర్పాట్లు చేసింది. అధికారులు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు చేయడం అందరి దృష్టిని విశాఖ ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించడంతో గిన్నిస్ రికార్డు సాధించి ప్రధానికి కానుకగా అందించింది ప్రభుత్వం. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు మొత్తం 3.20లక్షల మంది ఒకే విధంగా యోగాసనాలు వేశారు. క్రమశిక్షణతో, సమన్వయంతో సాగిన ఈ యోగా ప్రదర్శన చూపరులను అబ్బురపరిచింది. దీంతో 2003లో గుజరాత్ లోని సూరత్ లో 1,47,952 మందితో నిర్వహించిన యోగా రికార్డును ఇది అధిగమించింది. ఈమేరకు గిన్నిస్ రికార్డు ప్రతినిధులు ధృవపత్రాలను మంత్రి నారా లోకేశ్, సీఎస్ విజయానంద్లకు అందజేశారు.
ఇదిలా ఉంటే.. యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని మోదీ ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని అద్భుతంగా చేపట్టిందని కొనియాడారు. అలాగే యోగా కార్యక్రమంలో సమాజంలోని అన్ని వర్గాలను ఎలా భాగస్వాములను చేయాలో మంత్రి లోకేశ్ చేసి చూపించారని మెచ్చుకున్నారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఉద్రిక్తత, అశాంతితో సతమతమవుతోందని వాపోయారు. ఇలాంటి సమయంలో యోగా శాంతి మార్గాన్ని చూపుతుందని మోదీ విశ్వాసం వ్వక్తం చేశారు.
కాగా ఈ ఏడాది ‘ఒకే భూమి-ఒకే ఆరోగ్యం’ ఇతివృత్తంతో యోగా దినోత్సవం నిర్వహించారు. భూమిపై ప్రతి జీవి ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుందనే దానిని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, ప్రతాపరావు జాదవ్, డాక్టర్. పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ తదితరులు పాల్గొన్నారు.
Yogandhra: గిన్నిస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర
సంబంధిత వార్తలు | RELATED ARTICLES