Honda City sporty look : ప్రతి సంవత్సరం భారత ఆటోమొబైల్ రంగంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్త కొత్త మోడళ్లు మార్కెట్ ను ముంచెతుతున్నాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా తమ బహుళ ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ సెడాన్ సిటీకి మరింత ఆకర్షణీయమైన స్పోర్ట్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. దీనిని “హోండా సిటీ స్పోర్ట్” అనే పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.14.89 లక్షలు నిర్ణయించారు. ఇది హోండా అభిమానులకే కాకుండా, కొత్త తరం కారు కొనుగోలుదారులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చెప్పవచ్చు.
మోడ్రన్ స్పోర్ట్స్ థీమ్
ఈ స్పోర్ట్ ఎడిషన్‌లోని డిజైన్ అప్డేట్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. బ్లాక్డ్ అవుట్ గ్రిల్, బ్లాక్ ORVMs, ట్రంక్ లిప్ స్పాయిలర్, స్పోర్టీ బంపర్లు వంటివి కారుని దృఢంగా, యంగ్ ఫీల్‌తో తయారు చేశాయి. కారుపై “SPORT” అనే ఎంబ్లెమ్ ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. ఇది కేవలం ఒక వేరియంట్ మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైన స్టైల్ స్టేట్మెంట్ కూడా అని చెప్పవచ్చు.
ప్రీమియం ఫినిషింగ్
కారు లోపలి విషయానికొస్తే బ్లాక్ అంబియంట్ థీమ్ రెడ్ స్టిచింగ్‌తో కలిపి ఒక ప్రీమియం స్పోర్ట్ కార్ అనుభూతిని కలిగిస్తుంది. డాష్‌బోర్డ్‌పై రెడ్ గార్నిష్, 7-కలర్ అంబియంట్ లైటింగ్ తదితర అంశాలు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుతాయి. టెక్నాలజీ పరంగా, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, ప్యాడిల్ షిఫ్ట్స్ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి.
శక్తివంతమైన i-VTEC ఇంజిన్
సిటీ స్పోర్ట్ వాహనం 1.5 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 121 PS పవర్ మరియు 145 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉండటంతో, డ్రైవింగ్ అనుభవం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. E20 ఫ్యూయల్ అనుకూలతతో ఇది భవిష్యత్తు ఇంధన మార్పులకు సిద్ధంగా ఉంది.
హోండా సెన్సింగ్ తో మరింత భద్రత
హోండా సిటీ స్పోర్ట్‌లో హోండా సెన్సింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇందులో లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, కాలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్, ఆటో హై బీమ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి అభివృద్ధి చెందిన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS, ESC వంటి ప్రధాన భద్రతా ప్రమాణాలు కూడా కలవు.
ధర విషయానికొస్తే..
హోండా సిటీ స్పోర్ట్ ధర రూ.14.89 లక్షలుగా నిర్ణయించారు. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వీ, జెడ్, జెడ్ఎక్స్ వేరియంట్లలో వీ సీవీటీ ఆధారంగా రూపొందించారు. ఇది రూ.49,000 ప్రీమియం ధరతో వస్తోంది. హుందయ్ వర్నా, స్కొడా స్లేవియా, వోక్సవాగన్ విర్టస్ లాంటి కార్లతో పోటీ పడుతోంది.