Diplomacy’s Last Stand? UN Calls for Ceasefire in Iran-Israel War : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో, ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు “అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే” అని ఆయన స్పష్టం చేశారు. అమెరికాపై “సరైన సమయంలో, తగిన స్థాయిలో ప్రతిస్పందిస్తాం” అని ఇరావానీ ప్రకటించారు. ఇరాన్‌కు పూర్తి స్వీయ-రక్షణ హక్కు ఉందని, తమ ప్రతిస్పందన సమయం, పద్ధతి, స్థాయిని ఇరాన్ సైనిక బలగాలు నిర్ణయిస్తాయి అని ఆయన పునరుద్ఘాటించారు. చివరగా, ఇజ్రాయెల్ దౌత్య మార్గాన్ని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిందని ఆయన ఆరోపించారు.
పశ్చిమ దేశాలపై ఇరాన్ ఫైర్: ఇరాన్ రాయబారి ఇరావానీ పశ్చిమ దేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ చర్చలకు తిరిగి రావాలని ఆ దేశాలు అంటున్నాయని, అయితే తాము అసలు చర్చల నుంచే బయటకు వెళ్ళలేదని ఆయన స్పష్టం చేశారు. తమ విదేశాంగ మంత్రి ఇదివరకే ఈ విషయం చెప్పారని గుర్తు చేశారు. చర్చలు జరుగుతున్న వారం రోజుల్లోనే అమెరికా దాడులు చేసిందని, వీటి నుంచి ఏం నేర్చుకోవాలని ఆయన ప్రశ్నించారు.
ఇలాంటి దాడులు కేవలం రాజకీయ ఉద్దేశాలతో చేసినవి అని, అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకమని ఇరావానీ అన్నారు. ఇరాన్‌లో అమాయక పౌరుల ప్రాణ నష్టానికి, ముఖ్యంగా మహిళలు, పిల్లల మరణాలకు, కీలక సౌకర్యాల నాశనానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ పూర్తి బాధ్యత వహించాలని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ సమయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సరైన చర్యలు తీసుకోకపోతే, అంతర్జాతీయ శాంతిభద్రతలను కాపాడే బాధ్యతను, నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోతుందని ఇరావానీ స్పష్టం చేశారు.
రష్యా తీవ్ర హెచ్చరిక: ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులపై రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా ఐక్యరాజ్యసమితిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా “పాండోరా బాక్స్” తెరిచిందని, ఇది ప్రపంచ భద్రతకు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తుందని రష్యా హెచ్చరించింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా లక్షలాది పాలస్తీనియన్ల మరణాలను అమెరికా విస్మరిస్తోందని నెబెంజియా ఆరోపించారు. ఇరాన్ అణు సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం రష్యా మధ్యవర్తిత్వ ప్రతిపాదనను అమెరికా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత ఉద్రిక్తతకు పూర్తి బాధ్యత అమెరికాదేనని, ఈ పరిస్థితిని అదుపు చేయకపోతే మధ్యప్రాచ్యంలో భారీ యుద్ధం వచ్చి ప్రపంచ భద్రతకు ప్రమాదమని రష్యా స్పష్టం చేసింది.
ఇరాన్‌పై అమెరికా దాడులు: ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులను ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధి డ్యానీ డానాన్ సమర్థించారు. ఈ దాడులు మానవాళికి ఉన్న అతిపెద్ద ముప్పును తొలగించే కీలక చర్య అని ఆయన అభివర్ణించారు. అయితే, ఈ చర్యను కొన్ని దేశాలు తప్పుపట్టడంపై ఆయన భద్రతా మండలి సభ్యులను తీవ్రంగా ప్రశ్నించారు.
ఇరాన్ యూరేనియం శుద్ధిపై మౌనం ఎందుకు ? : ఇరాన్ పౌర వినియోగానికి మించిన స్థాయిలో యూరేనియంను శుద్ధి చేస్తున్నప్పటికీ, భద్రతా మండలిలోని కొన్ని దేశాలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. అణు ఆయుధాల తయారీకి అవసరమైన స్థాయికి యూరేనియం శుద్ధి జరిగితేనే స్పందిస్తారా అని నిలదీశారు.
ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనే ఆలోచనపై మౌనం ఎందుకు ? : ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనే ఇరాన్ ఆలోచనల గురించి భద్రతా మండలి సభ్యులు ఎందుకు స్పందించలేకపోయారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇజ్రాయెల్ భద్రతకు సంబంధించిన కీలక అంశంగా ఆయన పేర్కొన్నారు.
ఇరాన్ రహస్య కార్యకలాపాలు : డానాన్ తన వాదనను బలోపేతం చేస్తూ, ఇరాన్ చర్చల ముసుగులో రహస్యంగా రాకెట్లు నిర్మించడంలోనూ, యూరేనియం శుద్ధిలోనూ పురోగమించిందని స్పష్టం చేశారు. ఇరాన్‌కు అన్ని అవకాశాలు ఇచ్చామని, కానీ వారు తమ వైఖరిని మార్చుకోకపోతే, వారిని మార్చాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన నొక్కిచెప్పారు.