YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలో బయటకు చెప్పుకోలేని ఏదో గాభరా కనిపిస్తోంది. పార్టీ సమావేశాలలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, సీనియర్లు అన్న తేడా లేకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలపై అయితే చెప్పనే అక్కర్లేదు. అయినా ఆయన ఆగ్రహాన్ని, అసహనాన్నీ ఎవరూ పార్టీలో ఎవరూ లెక్క చేయడం లేదు. అందరికీ తత్వం బోధపడింది. భవిష్యత్ బొమ్మ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ కు జనం నో సెకండ్ చాన్స్ అన్న నిర్ణయానికి వచ్చేశారని వైసీపీ శ్రేణులకు కూడా అర్ధమైపోయింది.
ఇదే విషయం ఒకింత ఆలస్యంగానైనా జగన్ కూ బోధపడిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. వాస్తవానికి జనం పల్స్ ఏమిటి? మూడున్నరేళ్ల వైసీపీ పాలనపై జనం ఏమనుకుంటున్నారు అన్నది జగన్ కు అర్ధం కావడానికి ఆలస్యమైందేమో కానీ.. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులకు మాత్రం చాలా చాలా ముందుగానే విషయం అవగతమైంది. అందుకే, ‘గడపగడప’ అంటూ జగన్ పదేపదే చెబుతున్నా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కదలడం లేదు. ఇప్పటి వరకూ పదవిలో ఉన్నంత వరకు వుందాం, ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. అందుకే, గడప గడపకు వెళ్ళని వారికి టికెట్ ఉండదని ముఖ్యమంత్రి హెచ్చరించినా ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు.
అంతర్గత సంభాషణల్లో పార్టీ టికెట్ ఇచ్చినా పుచ్చుకునేది లే అంటున్నారు కూడా.
ఎప్పుడైతే, ఎమ్మెల్యేలలో ఈ విధమైన నిర్లిప్తత, నైరాశ్యం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంతో పాటుగా ఇతర సర్వే సంస్థలతో చేయించిన సర్వేలు నో సెకండ్ ఛాన్స్ అని స్పష్టం చేశాయి. దీంతో జగన్ కు కూడా విషయం అర్థమై కలవరపాటు ఆరంభమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించినా అదేమంత ఫలితం చూపడంలేదు. కారణమేమిటంటే.. ఆయన తీసుకుంటున్న చర్యలు రోగం ఒకటైతే మందు మరొకటి అన్నట్లుగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ ఇటీవల పార్టీలో మార్పులు, చేర్పులు చేపట్టడడం. జిల్లా అధ్యక్షులు, జిల్లా, ప్రాంతీయ సమన్వయ కర్తలను మార్చడం అన్నీ కూడా బయటకు నష్టనివారణ చర్యలుగానే కనిపిస్తున్నాయి.
కానీ ఇవన్నీ పైన చెప్పినట్లు రోగం ఒకటి.. మందు మరొకటి అన్నట్లుగానే ఉన్నాయి. బీసీలు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన కొద్ది మంది నాయకులకు పదవులు ఇచ్చినా, పక్కలో బల్లెంలా తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని జోడించడంతో ఈ మార్పుల వల్ల పెద్దగా మార్పేమీ లేని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి పరిశీలకులు, రాజకీయ పండితులు చెబుతున్నదాని ప్రకారం మార్పు రావాల్సింది ముఖ్యమంత్రి జగన్ లోనే కానీ, అది రావడం లేదు. ముఖ్యమంత్రి అహంకార ధోరణి, ఆనాలోచిత నిర్ణయాల కారణంగానే రాష్ట్రంలో పాలన కుంటుపడింది. ప్రగతి అడుగంటింది. కానీ జగన్ వీటిని విస్మరించి..ఇతరులలో లోపాలను ఎంచడానికి భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు.
ఇక సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి ఆశలు పెంచుకున్నా, వాస్తవంలో సంక్షేమ పధకాల ప్రయోజనాలు పొందుతున్న వారిలోనూ ఒక విధమైన అసంతృప్తి ఉందంటున్నారు. అలాగే పథకాలు అందని వారిలో మరోరకం అసంతృప్తి ఉందని అంటున్నారు. అతేకాకుండా సంక్షేమ పథకాలు అందుతున్నది మూడింట ఒక వంతు మందికి మాత్రమే అని ఈ లెక్కన చూస్తే, ముఖ్యమంత్రి లెక్క తప్పిందని తేలుతోందని, గడపగడపలో నిరసనకు ఇదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే, ముఖ్యమంత్రి ఎన్ని మార్పులు చేర్పులు చేసినా, సెకండ్ ఛాన్స్’కు నో ఛాన్స్ .. చాన్సే లేదని అంటున్నారు.