Trivikram Srinivas: టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఇది నిజంగానే ఊహించని శుభవార్త, పండగే పండగ! ఎన్నో ఏళ్లుగా విభిన్న కథలతో, విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న వెంకీ మామ ఇప్పుడు వరుస సినిమాలతో అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ మూవీ ఏకంగా రూ.300 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఆ తర్వాత ఏ మూవీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే గురూజీతో సినిమా చేస్తారనే దానిపై వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో ఇటీవల నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు.
మాటల మాంత్రికుడుతో చేయబోయే సినిమాతో పాటు విక్టరీ వెంకటేష్ మరిన్ని క్రేజీ సినిమాలను లైనప్ చేశారని మూవీ సర్కిల్స్ అంటున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల్లో భారీ అంచనాలను, ఉత్సాహాన్ని నింపింది. ఈ లిస్టులో ముందుగా మెగా 157 రిలీజ్ కానుంది. చిరంజీవి హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో వెంకటేష్ అతిథి పాత్రలో నటించారు. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది.
అయితే ఈ ఏడాది ఆగస్ట్‌లో వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ స్టార్ట్ కానుంది. దీన్ని వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేసేలా ప్లానింగ్ కూడా చేస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమా ఎలాంటి కథాంశంతో వస్తుందో, ఏ జోనర్లో ఉంటుందో అన్న ఆసక్తి ఇప్పటికే మొదలైంది. ఇది వెంకటేష్ గారి న్యూ ఏజ్ సినిమా లైనప్‌కు నాంది పలుకుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు, వెంకటేష్ నటన బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందా లేక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందా ? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరో వైపు ఈ ఏడాదిలో దృశ్యం 3 చిత్రాన్ని కూడా వెంకటేష్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ థ్రిల్లర్ సిరీస్ 2026 అక్టోబర్‌లో విడుదల కానుంది. మొదటి రెండు భాగాలు సృష్టించిన రికార్డులు, అందులోని థ్రిల్లింగ్ కథాంశం దృష్ట్యా, ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక నాలుగో చిత్రంగా అనీల్ రావిపూడి సినిమా రూపొందనుంది. ఈ మూవీని 2027 జనవరిలో స్టార్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ‘ఎఫ్2’, ‘ఎఫ్3’, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా కూడా పక్కా ఎంటర్టైనర్గా ఉంటుందని ఆశిస్తున్నారు. వెంకీ మార్క్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి దర్శకత్వ శైలి కలిసి మరో కామెడీ బ్లాక్‌బస్టర్‌ను అందిస్తాయని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా, రాబోయే రెండు మూడేళ్లు వెంకటేష్ అభిమానులకు నిజమైన పండగేనని చెప్పొచ్చు.