Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Sahithi Vanam: బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి బాపిరాజు

Sahithi Vanam: బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి బాపిరాజు

ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు. నవలా రచయిత, నాటక రచయిత, చిత్రకారుడు. వక్త. న్యాయవాది, అధ్యాపకుడు. ఇలా ఆయనకు చాలా బిరుదులు, అర్హతలున్నాయి. ఏతావతా, బహుముఖ ప్రజ్ఞలకు మారుపేరు అడవి బాపిరాజు. బాగా చిన్నతనం నుంచే సాహిత్యం పట్ల, సాహిత్య రూపాలపట్ల ఆసక్తి పెంచుకున్న అడవి బాపిరాజు 1985 అక్టోబర్‌ 8న పుట్టి 1952 సెప్టెంబర్‌ 22న కాలం చేశారు. ఆయనలో దేశభక్తి ఎక్కువ. దాస్యంలో, బానిసత్వంలో బతకడం వల్ల కలిగే కష్టనష్టాలను చూడడమే కాకుండా, స్వయంగా అనుభవించిన బాపిరాజు ఈ బానిసత్వం నుంచి దేశానికి విముక్తి కలిగే వరకూ నిద్రపోకూడని కంకణం కట్టుకున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఇంగ్లీషువారిపై తిరగబడుతూ వచ్చిన బాపిరాజు దాదాపు ప్రతి నిరసన ఉద్యమంలోనూ  పాల్గొన్నారు.1922లో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని అరెస్టు అయ్యారు. ఈ పోరాట పటిమతో పాటు ఆయన సాహిత్యాభిలాష కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది.

- Advertisement -

   జైలు జీవితం గడుపుతూనే ఆయన శాతవాహనుల నేపథ్యంలో సాగే ‘హిమబిందు’ అనే నవలను రాయడం ప్రారంభించారు. సాహిత్యాన్ని ఒక పక్క మధిస్తూనే మరోపక్క బందరు జాతీయ కళాశాలలో ప్రమోద్‌ కుమార్‌ చటోపాధ్యాయ అనే చిత్రకారుడి నుంచి భారతీయ చిత్రకళలో శిక్షణ పొందారు. అక్కడ శిక్షణ పొందుతూనే సముద్రగుప్తుడు, తిక్కన చిత్రాలను గీశారు. ఆ తర్వాత ఆయన తన స్వస్థలమైన భీమవరం వచ్చి అక్కడ న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అక్కడ ఆయన ‘నారాయణ రావు’ అనే సాంఘిక నవల రాశారు. ఆ నవల ఆయనకు ఎంతో  పేరు తెచ్చిపెట్టింది. ఈ నవలకు ఆంధ్ర విశ్వకళా పరిషత్తు పురస్కారం ప్రకటించింది. ఆయన ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకుడుగా కొనసాగుతూ 1934 నుంచి 1939 వరకు ప్రధానాచార్యుడుగా కూడా పనిచేశారు.అక్కడ ఉండగా ఆయన కథలు రాయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన దృష్టి సినిమాల మీదకు మళ్లింది. సినీ రంగ ప్రవేశం చేసిన అడవి బాపిరాజు ‘అనసూయ’, ‘ధ్రువ విజయం’, ‘మీరాబాయి’, ‘పల్నాటి యుద్ధం’ చిత్రాలకు ఆయన కళాదర్శకత్వం నిర్వహించారు.

జర్నలిజంలో కూడా..

ఆయనలోని సాహిత్యాభిలాష, రచనా వ్యాసంగం ఆయనను జర్నలిజానికి కూడా పరిచయం చేశాయి. హైదరాబాద్‌కు మకాం మార్చి ‘మీజాన్‌’ అనే తెలుగు దిన పత్రికలో చేరిన బాపిరాజు అతి తక్కువ కాలంలోనే ఆ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు. ఒక పక్క పత్రికా రచనను కొనసాగిస్తూ మరో పక్క ఆయన తెలుగునాట ఎంతో ప్రసిద్ధి చెందిన ‘తుఫాను’, ‘గోన గన్నారెడ్డి’, ‘కోసంగి’ నవలలు రాశారు. 1952 ప్రాంతంలో మద్రాసు వచ్చేసిన బాపిరాజు 1952 సెప్టెంబర్‌ 22న కన్నుమూయడం జరిగింది.తెలుగువారి నోట అచిరకాలంగా నానుతున్న, సినిమాల్లో సైతం ప్రాచుర్యం పొందిన ‘బావా బావా పన్నీరు’ పాటను రాసింది ఆయనేనన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. విచిత్రమేమిటంటే, ఆ నాటి నుంచి ఆయనను సన్నిహితులు, స్నేహితులు బావా బావా అనే పిలవడం ప్రారంభించారు.

   మద్రాస్‌ లా కాలేజీలో న్యాయవాద పట్టాను తీసుకున్న బాపిరాజు భీమవరం వచ్చి న్యాయవాద వృత్తిని చేపట్టారు కానీ, చివరకు ఆయన తన ఇతర వ్యాసంగాల కోసం ఆ వృత్తిని వదిలేశారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో కొంత కాలం పాటు సలహాదారుగా కూడా పనిచేసిన బాపిరాజు, నవ్య సాహిత్య పరిషత్‌ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. తాను నేర్చుకున్న చిత్రకళను ఇతరులకు నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బాపిరాజుకు చిన్నప్పటి నుంచీ కవితలు రాసే అలవాటు ఉండేది. కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘కిన్నెరసాని’ గేయ సంపుటికి బాపిరాజు గీసిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణ అయ్యాయి. 1922లో ఆయన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. తన జైలు జీవిత అనుభవాలను ఆయన ‘తొలకరి’ అనే నవలలో పొందుపరిచారు.

   నవరంగ్‌ అనే సంప్రదాయ పద్ధతిలో ఆయన అనేక చిత్రాలను గీయడం జరిగింది. బాపిరాజు చిత్రీకరించిన ‘శబ్ద బ్రహ్మ’ అనే చిత్రాన్ని డెన్మార్క్‌ మ్యూజియంలో భద్రపరిచారు. ఇక ఆయన గీసిన ‘భాగవత పురుషుడు’, ‘ఆనంద తాండవం’ అనే చిత్రాలను తిరువాన్కూర్‌ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఇక ఆయన 1951లో అప్పటి మద్రాస్‌ ప్రభుత్వం కోరికపై శ్రీలంకలోని సిగిరియా  కుడ్య చిత్రాల ప్రతికృతులను వేశారు. ఆయన ఏ రచన చేసినా తెలుగు పాఠకులంతా వాటిని ఆదరించడం విశేషం. గోన గన్నారెడ్డి వంటి చరిత్రాత్మక నవలలు డిగ్రీ స్థాయిలో పాఠ్య పుస్తకాలయ్యాయి. తెలుగు భాష, తెలుగు సాహిత్యం బతికి ఉన్నంత కాలం ఆయన పేరు అజరామరంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

 జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News