అసలు డీఎస్ ఆరోగ్యం ఎలా ఉంది.. ఇది ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశంగా తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. ఓవైపు పార్టీ మార్పు, మరోవైపు రాజీనామా లేఖ..ఇంకోవైపు డర్టీ పాలిటిక్స్.. చివరికి.. అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదాలు.. వెరసి ఇప్పుడివి మీడియాకెక్కి రచ్చ అవుతున్నాయి. ఇంటి గుట్టు రట్టు చేస్తూ డీ శ్రీనివాస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ మీడియాకు వెల్లడించారు.
తన తండ్రికి ఫిట్స్ వస్తే ఇంట్లోనే ఉంచారని, తమ్ముడు ధర్మపురి అరవింద్ తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నాడని అన్న సంజయ్ నిప్పులు చెరిగారు. రాజకీయ ప్రయోజనాల కోసం అత్యంత స్వార్థాన్ని కక్కుతున్న తన తమ్ముడు దిగజారి వ్యవహరిస్తున్నట్టు ఆయన ఆరోపించారు. అంతేకాదు తన తండ్రి చుట్టూ ఉన్నవారిపైన తనకు చాలా అనుమానాలున్నాయని కుండబద్ధలు కొట్టారు. అసలు డీఎస్ రాజీనామా లేఖలే బీజేపీ డర్టీ పాలిటిక్స్ అంటూ సంజయ్ చెబుతున్న తాజా విషయం.
డీఎస్, ఆయన కుమారుడు సంజయ్ ఇద్దరూ ఆదివారమే మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు. అంతే ఇక అప్పటినుంచీ క్షణ క్షణం ఉత్కంఠ ప్రారంభమైంది. ఒక్క రోజు కూడా తిరగకముందే కాంగ్రెస్ పార్టీకి డీఎస్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించటం సంచలనం సృష్టిస్తోంది.
డీఎస్ ఆరోగ్యం బాగాలేదని ఇంటివద్దకు రావద్దని డీఎస్ భార్య విజ్ఞప్తి చేయటం మరో ట్విస్ట్. అయితే తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్ లో చేరినందుకు తాను గాంధీభవన్ వచ్చినట్టు తాను పార్టీలో చేరలేదని డీఎస్ అదంతా ఉట్టి ప్రచారమేనంటూ డీఎస్ లేఖ రాశారు. అయితే ఇదంతా తన తమ్ముడు అరవింద్ ఒత్తిడిమేరకే సాగిందని సంజయ్ తాజాగా వివరించటంతో అన్నదమ్ముల మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి.
డీఎస్ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తూ.. ఆయన పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నట్టు, బ్రెయిన్ కు స్టిమ్యులేషన్ సర్జరీ జరిగినట్టు మీడియాకు వివరించింది. నిజానికి సీనియర్ సిటిజెన్ కూడా అయిన డీఎస్ ఎలాంటి ఒత్తిడులకూ లోనుకాకూడదని వైద్యులు హెచ్చరించారు. ఇక ఈ మొత్తం వ్యవహారంపై అసలు ధర్మపురి అరవింద్ ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. దీంతో అరవింద్ ఏం చెబుతారు, ఎప్పుడు స్పందిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.