ప్రభుత్వం బంగ్లా ఖాళీ చేయండని రాహుల్ గాంధీకి నోటీసులు అందాయి. పార్లమెంటు సభ్యుడిగా అనర్హత వేటుపడిన నేపథ్యంలో న్యూ ఢిల్లీలో రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 12, తుగ్లక్ లేన్, తుగ్లక్ రోడ్ బంగ్లాను ఏప్రిల్ 22, 2023 వ తేదీలోపు ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చారు.
లోక్ సభ హౌసింగ్ కమిటీ ఈ నోటీసులు ఇచ్చింది. అయితే దీనిపై రాహుల్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగొలుపుతోంది. మోడీ పేరు ఉన్నవారంతా దొంగలే అంటూ కర్నాటకలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టులో పరువునష్టం, క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న రాహుల్ గాంధీకి కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. దీంతో రాహుల్ పార్లమెంటు సభ్యుడిగా తన అర్హతను కోల్పోయారు. కాగా ఏప్రిల్ 22 లోగా ఆయన పై కోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ సూరత్ కోర్టు ఆయనకు 30 రోజులు గడువు, బెయిలు మంజూరు చేసింది.