అన్ని వర్గాల సంక్షేమం ఒక్క బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. పల్లె పల్లెకు పైలెట్‌లో భాగంగా యాలాల మండలంలోని రాస్నం, గంగాసాగర్, సంగాయిపల్లి తాండా, సంగాయిపల్లి మీది తాండా, సంగాయిపల్లి కింది తాండా, పగిడియాల, బాగాయిపల్లి, అచ్యుతాపూర్ తో పాటు పలు గ్రామాల్లో పర్యటించి, ప్రజా సమస్యల్ని అడిగి ఆయన తెలుసుకున్నారు.
తాము తాండూరు చరిత్ర రూపురేఖలనే మార్చుతున్నామని తాండూరులో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ యాత్ర కొనసాగించారు. ఈ కార్యక్రమంలో భాగాయపల్లిలో భారీ సంఖ్యలో యువత, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. వారిని గులాబీ కండువా కప్పి ఆయన పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానించారు.
పల్లె పల్లెకూ పైలెట్ కార్యక్రమంలో ఎమ్మెల్యేకి అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరై ఎమ్మెల్యే పైలట్ కి ఘన స్వాగతం పలికారు. ప్రజలు తన దృష్టికి తెచ్చిన కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేశారు ఆయన. రుణమాఫీ గురించి రైతులు అడుగగా.. తప్పకుండా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అచ్యుతాపూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు కావాలని ప్రజలు వేడుకోగా వెంటనే డిపో మేనేజర్ తో ఫోన్లో మాట్లాడి బస్సు వచ్చేలా ఏర్పాటు చేయాలని తెలిపారు.