Friday, September 20, 2024
HomeఆటNikhath Zareen: నిఖత్ పంచ్ అందిరింది

Nikhath Zareen: నిఖత్ పంచ్ అందిరింది

నిఖత్ ‘పంచ్’ అదిరింది. అమ్మాయిల పంచ్ పవర్ ఎలా ఉంటుందో నిఖత్ మరోసారి చూపింది. అమ్మాయిలు బాక్సింగులో అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోరని మరోసారి నిరూపించింది. అద్రుష్టంతో కాదు అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతోనే పతకాలను కైవసం చేసుకుంటున్నానని చాటిచెప్పి మరోసారి విమర్శకుల నోళ్లను మూయించింది. ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచే నిఖత్ ‘బరి’ బయట కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఆ విశేషాలు కొన్ని…
నిఖత్ జరీన్ విజయం వెనుక పడ్డ కష్టం ఎంతో ఉంది. నిజామాబాద్ కు చెందిన జరీన్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. తన బాక్సింగు కలను నిజం చేసుకోవడానికి రింగులోనే కాదు రింగు బయట కూడా జరీన్ ఎంతో పోరాడింది. బాక్సింగులో ఆడపిల్లలు కూడా మగవారికి ఏమాత్రం తీసిపోరని చాటిచెప్పింది. కుటుంబం, సన్నిహితులు కష్టకాలంలో జరీన్ కు ఇచ్చిన మద్దతు మరుపురానిదని జరీన్ తండ్రి జమీల్ అహ్మద్ అంటారు. జరీన్ బాక్సింగ్ బరిలోకి దూకేలా ప్రోత్సహించడం వెనుక తండ్రి జమీల్ ఎంతో అండగా నిలబడ్డారు. బాక్సింగ్ కెరీర్ ను ఎంచుకోమని నిఖత్ ను తొలుత ప్రోత్సహించింది నిజామాబాద్ లోని బాక్సింగ్ కోచ్ షంషుద్దీన్. బాక్సింగ్ పట్ల జరీన్ కు ఉన్న ఇష్టం, ఆడవాళ్లు కూడా ఇందులో సత్తాచూపగలరని నిరూపించాలన్న ఆమె పట్టుదల, ఆ దిశగా విజయం సాధిస్తానన్న ఆమెలోని ఆత్మవిశ్వాసమే జరీన్ ను బాక్సింగ్ క్రీడలో ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచేట్టు చేసింది.

- Advertisement -

తాను బాక్సింగ్ నేర్చుకుంటానని జరీన్ చెప్పినపుడు తల్లి ‘ వద్దు. నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరు’ అన్నారుట. అమ్మాయి బాక్సర్ అవడం ఏమిటని జరీన్ ను హేళన చేసినవారు కూడా ఎందరో ఉన్నారు. ఇలాంటి ఎందరి విమర్శలు, ఛీత్కారాలను నిఖత్ దాటుకుంటూ వచ్చింది. తన లక్ష్యాన్ని సాధించడానికి
ఇంటా, బయటా కూడా జరీన్ పోరాడింది. చుట్టాలు కూడా జరీన్ కోరికకు మోకాలడ్డువేశారు. అమ్మాయి బాక్సింగ్ నేర్చుకోవడం ఏంటి అని జరీన్ ను నిరుత్సాహపరిచారు. అయినా ఇవేవీ నిఖత్ లోని పట్టుదలను
నీరుగార్చలేకపోయాయి. బాక్సింగులో పురుషులకు ఏమాత్రం మహిళలు తీసిపోరని నిరూపించాలన్న తన ధ్యేయాన్ని నిఖత్ సుసాధ్యం చేసుకుంది.
బాక్సింగ్ పై తన ఆసక్తిని గమనించిన తండ్రి తనకు ఎంతో మద్దతును, నైతికస్థైరాన్ని ఇచ్చారని జరీన్ గర్వంగా చెప్తుంది. ‘నేను టాప్ అథెలెట్ గా నిలవాలని, భారత్ కు అంతర్జాతీయస్థాయిలో పతకాలను తేవాలని మా నాన్న కోరిక’ అని నిఖత్ చెప్పింది. మహిళా అథెలెట్ గా అందులోనూ ఒక ముస్లిం ఎథెలెట్ గా సంప్రదాయ సమాజాన్ని ఎదుర్కోవడంలో ఎన్నో ఆటుపోట్లు నిఖత్ చవిచూశారు. తన లక్ష్య సాధనలో ఎన్నో రకాల సామాజిక ఒత్తిడులను, ఆటంకాలను ఎదుర్కొన్నారు.

‘షార్టులు వేసుకుంటున్నందుకు ఎందరో నాపై తీవ్రంగా విమర్శలు కురిపించారు. బాక్సింగ్ మహిళల క్రీడ కాదని, ఆడకుండా ఇంట్లో కూర్చోమని నన్ను తీవ్రంగా మందలించిన వారూ ఎందరో ఉన్నారు. 2018లో నా భుజానికి తీవ్ర గాయం అయినపుడు పెద్ద సర్జరీ అయింది. దాంతో నా బాక్సింగ్ కెరీర్ ముగిసిందని చాలామంది భావించారు. కానీ కిందపడిన నేను మరింత పట్టుదలతో పైకి లేచాను. ఆ తర్వాతే నేను స్ట్రాంజా లో బంగారు పతకం గెలిచాను. ఆసియన్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం, ధాయ్ లాండ్ ఓపన్ లో మరో బంగారు పతకం గెలుచుకున్నా. 2021లో బోస్ఫోరస టోర్నమెంటులో కాంస్యం సాధించా. ఆ పోటీలో నేను ఒలింపిక్ పతక విజేతలతో, ప్రపంచ ఛాంపియన్లతో పోరాడి గెలిచా. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్ అయ్యా. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్యా నేను నా కల వెంట పరుగు పెడుతూనే ఉన్నా. పడిలేస్తూ ప్రయాణం సాగించా’ అని జరీన్ చెప్పుకొచ్చింది.

స్నేహితులు, బంధువులు, సమాజం, సంప్రదాయాలు, లింగవివక్ష, ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో ఆమె కెరీర్ కు ఆటంకాలుగా నిలిచినా నిఖత్ తన ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను వీడలేదు. ఏ క్షణంలోనూ మానసికంగా కుంగుబాటుకు లోనుకాకుండా తన పంచ్ పవర్ ను నిఖత్ చూపించింది. ‘మా నాన్నతో బాక్సింగ్ అమ్మాయిల ఆట కాదంటున్నారు అని అన్నప్పుడు, మా నాన్న పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరని అన్నారు’ అని జరీన్ తన తండ్రి తనకు ఇచ్చిన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. అలా బాక్సింగ్ బరిలో కాలు మోపిన జరీన్ ఇక మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘ నా ఆట బాక్సింగ్ అని తెలుసుకున్నా. నా క్రీడా ప్రయాణంలో ప్రతిక్షణం నాన్న నాకు అండగా నిలబడ్డారు. నన్నెతో ప్రోత్సహించారు.

ఈ రోజు ఇలా నిలబడగలిగానంటే ఆయన ఇచ్చిన అండదండలే కారణం. ఈ క్రీడలో నేను ప్రయాణించాల్సిన దూరం ఇంకా ఎంతో ఉంది’ అని జరీన్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. తన తర్వాత లక్ష్యం 2024 సంవత్సరంలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్ లో భారతదేశానికి బంగారు పతకం సాధించడమేనని జరీన్ స్పష్టంచేశారు. 2007లో నిజామాబాద్ కలెక్టరేట్ క్రీడా ప్రాంగణంలో బాక్సింగ్ పాఠాలు నేర్చుకోవడంతో ప్రారంభమైన నిఖత్ ప్రయాణం తన ఆటకు మరింత పదునుపెట్టుకునేందుకు గాను హైదరాబాదుకు చేరుకున్నారు. హైదరాబాద్ లో కోచ్ చిరంజీవి దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఆతర్వాత నిఖత్ కు విశాఖపట్నం ‘సాయ్’ సెంటర్ లో శిక్షణ తీసుకునే అవకాశం వచ్చింది. అనంతరం జూనియర్ వరల్డ్ ఛాంపియన్ గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. పాఠశాల స్థాయి నుంచీ ఈ క్రీడా పోటీలో నిఖత్ జరీన్ పాల్గొనడమే కాదు ఎన్నో పతకాలను కైవసం చేసుకుంది. ఆమె తండ్రి కూడా క్రీడాకారుడే. ఆయన సౌదీ అరేబియాలో ఉద్యోగం చేసేవారు. అయితే ఎప్పుడైతే జరీన్ కు క్రీడలపై ఆసక్తి ఉందని తెలిసిందో ఆ క్షణమే అక్కడ ఉద్యోగం మానేసి సొంత ఊరికి ఆయన వచ్చేశారు. కూతురుకు అండగా నిలబడ్డారు. అమ్మాయికి ఈ క్రీడ నేర్పించడం ఏమిటి అని చాలామంది అడ్డగించినా, నిరుత్సాహపరిచినా నిఖత్ తండ్రి వెనకడుగువేయలేదు.

ఏ ఆటలోనైనా మొదటి సూత్రం ‘ఆటను ఎలాంటి పరిస్థితిలోనూ వదలకూడదు’ అని తండ్రి తనకు చెప్పేవారని పలుసందర్భాలలో నిక్కత్ జరీన్ అన్నారు. పట్టుదలతో, క్రమశిక్షణతో నిరంతర సాధన చేస్తూ బాక్సింగ్ లో అంతర్ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్షిప్ లను నిఖత్ కైవసం చేసుకుంది.
ఈ నిజామాబాద్ బాక్సర్ అమ్ముల పొదిలో ఎన్నో అంతర్జాతీయ అవార్డులు ఉన్నాయి. వాటిల్లో కామన్ వెల్త్ గేమ్స్, ఐబిఎ విమెన్ వరల్డ్ ఛాంపియన్షిప్, స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్ వంటివి కొన్ని మాత్రమే.

రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయి విజేతగా నిలిచి తన విమర్శకుల నోళ్లను నిఖత్ మూయించింది. ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తీసుకుంది. ‘మంచి చేస్తే మంచే జరుగుతుందంటారు. అలాగే నేను ఎప్పుడూ కష్టపడుతూ అనుకున్న లక్ష్యాలను సాధిస్తాను’ అంటుంది నిఖత్. సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన నిఖత్ అమ్మాయిలకు బాక్సింగ్ ఆట ఏమిటన్న విమర్శలు, వ్యంగాలు, అవమానాలు ఎన్నింటినో దాటుకుని ఈ క్రీడలో దేశ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయంగా ఎగురవేస్తోంది. మనదేశంలోని ఎందరో యువతులకు బాక్సింగ్ క్వీన్ గా నిఖత్
స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News