మే 10వ తేదీన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో సాగనున్నాయి. 13 మే ఎన్నికల లెక్కింపు జరుగనుంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 224 మంది సభ్యులున్న కర్నాటక అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా..ఉప ప్రాంతీయ పార్టీగా దేవగౌడ నేతృత్వంలోని జేడీఎస్ ఒక ప్రాంతానికే పరిమితమై ఉంది. మే 24వ తేదీకల్లా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రహసనం పూర్తి కానుంది.
ఈ ఎన్నికల్లో 80 ఏళ్ల పైనబడ్డవారు, స్పెషల్లీ ఏబుల్డ్ సిటిజెన్స్ ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని ఈసీ కల్పిస్తోంది. ఫస్ట్ టైం ఓటర్ల విషయానికి వస్తే 9,17,241 మంది ఉన్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. కర్నాటకలో మొత్తం 5.21 కోట్ల ఓటర్లున్నారు.
కర్నాటకలో ప్రధాని మోడీ, అమిత్ షా విస్తృతంగా పర్యటించేలా ప్రణాళికలు రెడీకాగా.. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారం జోరుగా చేసేందుకు ఉత్సాహం చూపుతుండటం విశేషం.
కల్యాణ రాజ్య ప్రగతి పక్షా పేరుతో సొంత కుంపటి పెట్టుకున్న మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత, బళ్లారి గనుల కుంభకోణంలో చిక్కుకున్న గాలి జనార్ధన్ రెడ్డి తన పార్టీ తరపున అప్పుడే 21 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
ఇక తాము మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమని సీఎం బసవరాజు బొమ్మై విశ్వాసం వ్యక్తంచేస్తూ.. ఈసారి తమ మెజార్టీ మరింత పెరుగుతందన్నారు. ఓవైపు బొమ్మై, యడ్యూరప్ప వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరగా..ఇటు కాంగ్రెస్ లోనూ సిద్ధు, డీకే వర్గాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. వెరసి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో సర్వత్రా ఆసక్తనెలకొంది.