అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి హాజరైన జర్నలిస్టులను హుజురాబాద్ ఏసిపి కళ్యాణ ప్రాంగణంలోకి అనుమతించ లేదు. దేవస్థాన ఈవో ఇచ్చిన మీడియా పాసులను అనుమతించకపోగా వాటిని చించిపడేశారు. ఇదేంటి అని ప్రశ్నించిన జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పలువురు జర్నలిస్టులు ఏసిపి వెంకట్ రెడ్డి వైఖరికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సుమారు గంటన్నర పాటు కళ్యాణమంటపం ఎదురుగానే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
జర్నలిస్టులు చేస్తున్న నిరసనకు కాంగ్రెస్ నాయకులు పత్తి కృష్ణారెడ్డి మద్దతు పలుకుతూ నిరసనలో కూర్చున్నారు. ఆలయ ఈవో సుధాకర్ సంతకము చేసి ఇచ్చిన పాసులను అనుమతించకపోగా జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటని ప్రశ్నించారు. జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏసిపి తీరుపై జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.